"పిచ్చి వేషాలు వేయటానికి ప్రయత్నించకు రాజూ..... నా సంగతి నీకు తెలియదు" అంటూ కత్తిని అతని వెన్నుకు మరింత గట్టిగా ఆనించి బయటికి పదమని సైగ చేశాడు సాగీ.
బయటికి వచ్చాడు షాడో. వస్తూనే మెరుపులా క్రిందికి వంగి బొంగరంలా గిర్రున తిరిగాడు.
అదిరిపడి కత్తిని పైకి ఎత్తాడు సాగీ. కంటికి కనిపించనంత వేగంతో పోయి అతని గుండెల మీద తగిలింది షాడో ప్రయోగించిన స్ర్పింగ్ కిక్.
కాంక్రీట్ దిమ్మ గుండెలకు గుద్దుకున్నట్లు బాధగా మూలుగుతూ బూత్‌లో పడిపోయాడు సాగీ. అతని చేతి లోని కత్తిని అవతలకు తన్ని, క్రిందికి వదిలిన రిసీవర్ని అందుకున్నాడు షాడో.
ఆఫీసులో వున్నాడు కమీషనర్ సన్యట్..... అతని కంఠం వినిపించగానే రెండు కాయిన్స్‌ని ఫోన్ బాక్స్‌లో వేసి 'హల్లో!' అన్నాడు షాడో.
అతని కంఠాన్ని వెంటనే గుర్తుపట్టాడు కమీషనర్.
"మిస్టర్ షాడో! మైగాడ్!! ఎక్కడ నుంచి!!!" ఆశ్చర్యంగా అడిగాడు.
ముక్తసరిగా చెప్పాడు షాడో. జరుగబోతున్న దాఋణాన్ని గురించి.
"మీరు సరస్సు దగ్గిర మాటు వేయండి సార్.... ఏ మాత్రం ఏమరిపాటుగా వున్నా ఆ తర్వాత విచారించి ప్రయోజనం లేదు.... బై ది బై...... నా దగ్గిర ఒక రౌడీ స్పహ లేకుండా పడి వున్నాడు. ఇతన్ని బంధించండి. ఎవరికీ తెలియకూడదు. వార్త బయటికి రాకూడదు" అంటూ తను వున్న ప్రదేశపు గుర్తులు చెప్పి లైన్‌ని డిస్కనెక్ట్ చేశేశాడు.
"హల్లో! హల్లో!!" అని అరిచాడు కమీషనర్ సన్యట్. అప్పటికే లైన్ కట్ అయిపోవటం వల్ల సమాధానం రాలేదు.
