“నీ పేరు ఏమిటి?
“రాజూమియా”
"మా దేశంలోకి ఎందుకు వచ్చావ్?”
ప్రధానమంత్రిగారి సమావేశంలో ప్రిపేర్ చేయబడిన వివరాలన్నిటినీ టేప్రికార్డర్లా వల్లెవేశాడు షాడో. రథన్పూర్ స్టేట్బేంక్ని కొల్లగొట్టి, గుజరాత్ రాష్ట్రంనుంచి రాజస్థాన్‌లోకి పారిపోయినట్లు చెప్పాడు. రాజస్థాన్ పోలీసులు కూడా వెంటపడేసరికి విధిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్‌కి పరిగెత్తుకువచ్చినట్టు వివరించాడు.
“పాకిస్తాన్ పోలీసులు చేతగానివాళ్ళని, నీ గురించి పట్టించుకోరని నీ ఉద్దేశ్యమా?”
సడన్‌గా వినవచ్చిన ఆ ప్రశ్నను ఆలకించగానే, పళ్ళు బిగపట్టి రెడీ అయిపోయాడు షాడో.
అతను ఊహించినట్లుగానే సమాధానం కోసం ఎదురుచూడలేదు ఇంటరాగేషన్ గదిలోకి అతన్ని పిలిపించిన ఆ పోలీస్ అధికారి. ఇనుపరేకులు తాపడంచేసి వున్న హేండ్స్టిక్ని ఎత్తి రెచ్చిపోయాడు.
తలకు చేతులు అడ్డంపెట్టుకుని కుర్చీలో నుంచి జారిపోయాడు షాడో. బాధాసూచకమైన శబ్దాలు చేస్తూ ఇంటరాగేషన్ గదిలో పొర్లిగింతలు ప్రారంభించాడు.
అతనితోపాటు గదినంతా కలియతిరుగుతూ విరగబాది వదిలాడు ఆ అధికారి. ఆయాసం అధికమైన తరువాత వెనక్కి తగ్గి గుమ్మంలో వున్న కానిస్టేబుల్స్‌ని పిలిచాడు.
కాళ్ళు చేతులు విరిగిపోయినంత బాధతో విలవిలలాడిపోతున్న షాడో జుట్టుపట్టుకుని బయటికి ఈడ్చారు వాళ్ళు. ఈడ్చుకుంటూనే తీసుకుపోయి సెల్‌లోకి దొర్లించారు.
కటకటాల్లోనుంచి వాళ్ళు ముఖంమీదికి విరజిమ్మిన నీళ్ళమూలకంగా తేరుకోలేదు షాడో... అడ్డదిడ్డంగా పడివున్న తన పాదాలను ఎవరో గట్టిగా గుంజుతున్న సెన్సేషన్ క్షణక్షణానికి అధికం అయ్యేసరికి తెలివివచ్చి కనులు తెరిచాడు.
వెంటనే అగుపించాయతనికి కుక్కపిల్లల సైజులో వున్న రెండు ఎలుకలు. అడిగేవాళ్ళు, అదుపుచేసేవాళ్ళు లేకపోవడం వల్ల కాబోలు - పట్టపగలే మనుషుల్ని ఎటాక్ చేసే ధైర్యాన్ని పెంపొందించుకున్నాయవి.
తన సెల్‌మేట్ అనారోగ్యానికి కారణం అవేనేమోనన్న అనుమానం ఛట్‌మని తలెత్తేసరికి అదిరిపడి పాదాలను విదిలించాడు షాడో. విపరీతంగా లావెక్కివుండడంవల్ల వేగంగా కదలలేకపోయాయవి. హేండ్బాల్స్ మాదిరి దొర్లుకుంటూ కాంక్రీట్‌తో నిర్మించబడిన బంక్స్ చాటుకుపోయి అదృశ్యం అయ్యాయి.
