“అయితే ఏమయింది? యింతవరకూ వచ్చిన సి.ఐ.డి.లకు పట్టిన గతే ఆ ఏజెంట్లకూ పడుతుంది!” నవ్వాడు షంషేర్.
“యస్ సర్!.... మీరు అన్నంత పనీ చేయగలరని మాకు నమ్మకం వున్నది. బట్ ఐ వార్న్ యూ. సి.ఐ.బి. ఏజెంట్లను తక్కువగా అంచనా వేయకండి. చైనా లాంటి మహా దేశాలే వారి ముందు తల్లడిల్లిపోయాయి.” వార్నింగ్ ఇచ్చాడు వచ్చిన వ్యక్తి.
“రాజభవనంలో వున్న మనవాళ్ళు తెలుసుకున్నారీ విషయాన్ని. సి.ఐ.బి. వెంటనే తగిన చర్య తీసుకుంటానని మాట యిచ్చిందట” అని గూడా చెప్పాడు.
“సి.ఐ.బి. ఏజెంట్లు ఎవరెవరున్నారు? వారి వివరాలు బజూకాకు కబురు పంపి తెలుసుకో. ముందే జాగ్రత్త పడదాం” అన్నాడు సింకారా.
“మీరు అనవసరంగా భయపడకండి. వాళ్ళ వంతు నేను చూసుకుంటాను. ఎవడొచ్చినా సరే - మంచులో పాతేయిస్తాను.” గడ్డం దువ్వుకుంటూ అన్నాడు షంషేర్.
అప్పుడు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు షాడో.
“యస్ మై డియర్ షంషేర్! ఐయామ్ హియర్ - సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో ఫ్రమ్ సి.ఐ.బి.” అన్నాడు రివాల్వర్ ఎత్తుతూ.
సింకరా గిరుక్కున వెనుతిరిగాడు. కోటులో పెట్టిన రివాల్వర్ తీయబోయాడు. షాడో చేతిలోని రివాల్వర్ నిప్పులు కక్కింది సింకారా, అతనికి వార్తలు అందించిన రాజభవన పరిచారికుడూ పరలోకానికి ప్రయాణం కట్టాడు.
