ఇది మేము ప్రచురిస్తున్న ప్రసిద్ధ విద్యావేత్త జాన్ హోల్ట్ తాజా పుస్తకం. మేం ఇప్పటికే 'పిల్లలు ఎలా నేర్చుకుంటారు','పిల్లలు ఎలా వెనకబడతారు', 'బాల్యం నుండి స్వేచ్ఛ' పుస్తకాలను ప్రచురించాము. 'స్కూలంటే ఎలా ఉండాలి' పేరుతో తీసుకు వస్తున్న ఈ పుస్తకం 'అండర్ ఎచీవింగ్ స్కూల్' పేరుతో వెలువడింది. ప్రస్తుతం స్కూళ్ళు ఎలా ఉంటున్నాయి, అవి నిజంగా విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, భవిష్యత్తుకు ఉపకరించే విధంగా విద్యార్థులకు అవి తర్ఫీదు ఇస్తున్నాయా - ఇలాంటి విషయాలను ఆయన ఈ పుస్తకంలో చర్చించారు. నేడు అత్యధిక స్కూళ్ళు వాటి బాధ్యతను నెరవేర్చడం లేదని, అవి పిల్లలను భయపెట్టే ప్రదేశాలుగా ఉంటున్నాయని, వాటిని పిల్లలు అభిమానించడం మాట అటుంచి అవి తమపాలిట జైళ్ళు అని భావించే విధంగా తయారయ్యాయని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు ఆయన సాధికారకమైన ఆధారాలను కూడా చూపించారు. విమర్శలు చేయడం, వాటిని సమర్థించుకోవడంతోనే ఆయన ఆగిపోలేదు, నిజమైన స్కూళ్ళంటే ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుచేతనే ఇది విద్యావేత్తలకు, తల్లిదండ్రులకు, స్కూళ్ళ నిర్వాహకులకు ఎంతగానో ఉపకరించే పుస్తకం. విద్యారంగానికి సంబంధించి మా మిగతా ప్రచురణల మాదిరిగానే దీన్నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
- ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాదు
