-
-
శాస్త్రీయ దృక్పధం - పాఠకుల ప్రశ్నలూ, రంగనాయకమ్మ జవాబులూ
Sastriya Dhrukpadham Pathakula Prasnaluu Rranganayakamma Jawaabuluu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 215Language: Telugu
పాఠకులు అడిగిన ప్రశ్నలూ, నేను ఇచ్చిన జవాబులూ కలిసిన పుస్తకం ఇది.
'శాస్త్రీయ దృక్పధం' - అనడంలో నా ఉద్దేశ్యం 'మార్క్సిస్టు దృక్పధం' అనే. 'మార్క్సిజం' - మానవ సంబంధాల గురించి తార్కికంగా వివరిస్తుంది. అందుకే అది, సమాజానికి సంబంధించిన 'శాస్త్రం' అవుతుంది. సమాజంలో ఏ నాటి నించో 'శ్రమ దోపిడీ' అనేది సాగుతోందనీ; మనుషులు, 'యజమానులూ - శ్రామికులూ' అనే వర్గాలుగా విడిపోయి వున్నారనీ; ధనిక - పేద భేదాలకు అదే కారణమనీ, మార్క్సిజం వివరిస్తుంది. యజమాని వర్గం - ఏ శ్రమలూ చెయ్యకుండా, 'భూమి కౌళ్ళూ - వడ్డీలూ - లాభాలూ' అనే 'దోపిడీ ఆదాయాల' ద్వారా జీవిస్తూ వుంటుంది. ఆ ఆదాయాలు, 'స్వంత శ్రమ' లేకుండా వచ్చే ఆదాయాలు. అవి శ్రామిక ప్రజల శ్రమల్లో భాగాలు. తను ఒక శ్రమ చేస్తూ, ఆ శ్రమ కోసం వచ్చే 'జీతం'తో జీవించే వ్యక్తి - శ్రామికుడు ( స్త్రీ అయినా, పురుషుడైనా). 'జీతం'తో గాక, భూమి కౌళ్ళతో గానీ, వడ్డీ లాభాలతో గానీ జీవించే వ్యక్తులు, ఇతరుల శ్రమల్ని దోపిడీ చేస్తూ జీవించే వ్యక్తులు.
'శాస్త్ర జ్ఞానం' (సైన్సు) అన్నప్పుడు, సాధారణంగా - చాలా మంది, 'ప్రకృతి'కి సంబంధించిన విషయాల్ని సరిగా గ్రహించడం - అని మాత్రమే భావిస్తారు. నాస్తికులూ హేతువాదులూ ప్రధానంగా ప్రకృతి విషయాల్ని మాత్రమే వివరిస్తారు.
నాస్తికులూ హేతువాదులూ సామాజిక విషయాల గురించి బొత్తిగా మాట్లాడరని దీని అర్థం కాదు. కొన్ని సందర్భాలలో ఆ విషయాలు కూడా మాట్లాడుతారు. కానీ, వారు, 'వర్గ భేదాల' గురించీ, 'శ్రమ దోపిడీ' గురించీ, చెప్పలేరు కాబట్టి, సమాజం గురించి వారు చెప్పేది చాలా పరిమితుల్లోనే వుండిపోతుంది. అందులో చాలా విషయాలు, అమలులో వున్న దోపిడీ సంబంధాలనే సమర్ధించేవిగా, పొరపాటుగా ఉంటాయి. 'శ్రమ దోపిడీ' గురించి తెలియకపోవడం వల్లనే అలా జరుగుతుంది. అసలు నిజం తెలియకుండా, అమల్లో వున్నదాన్ని మాత్రమే చూసి మాట్లాడితే అది, 'శాస్త్ర జ్ఞానం' అవదు.
పాఠకులు అడిగిన ప్రశ్నలకు జవాబు లివ్వవలసి వచ్చినప్పుడు, ప్రతీ ఒక్క ప్రశ్నకీ జవాబు నా చేతిలో సిద్ధంగా లేదు. కొన్ని జవాబుల కోసం ఎంతో చదవవలసి వచ్చింది. దాని వల్ల, నే నెంతో నేర్చుకోగలిగాను. విషయం నాకు స్పష్టం అయిన తర్వాతే ఆ జవాబులు రాశాను.
ఒక విషయానికి సంబంధించిన అసలు కారణాలు తెలిసిపోతే, దాన్ని గురించి ఇక ప్రశ్నలు వుండవు. 'సమాజం' గురించి కూడా అంతే.
- రంగనాయకమ్మ
