-
-
సరదాగా మరికొంతసేపు
Saradaga Marikontasepu
Author: Gabbita Krishna Mohan
Publisher: Navachetana Publishing House
Pages: 189Language: Telugu
"సరదాగా మరికొంతసేపు" అన్న వుడ్హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో "సినిమారంగం"కు చెందినవి నాలుగు.
వుడ్హౌస్ అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న "అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై" అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో "సోంబాబాయి వలస కాపురం" గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా "అవతారం" ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో "తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని" అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.
మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్య పాత్రధారి. ఆమె తల్లి మహా రచయిత్రి ప్రసూనాంబ విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ తాను ఇష్టపడే నరహరిని కాకుండా తల్లి సూచించి బాధించే వర్ధమాన రాజకీయ నాయకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో "తెల్లవారుఝాము పాలబండి"లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.
"విధి, "అదృష్టం" అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత - శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం - ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ "తాత్విక దృష్టితో" చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.
సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ "కోతిచేష్టలు"లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ "మీనా దేశ్పాండే తారాపథం" మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.
