-
-
సమర్చన
Samarchana
Author: Dr. Kovela Suprasannacharya
Publisher: Jatiya Sahitya Parishat
Pages: 168Language: Telugu
శ్రీమద్రామాయాణాన్ని తపోమయకావ్యంగా దర్శించినా, మహాభారతాన్ని అంతులేని అంతర్యుద్ధంగా విశ్లేషించినా, పురాణాలను కనిష్ఠపక్షం మూడు అంచెల్లో అనుశీలించాలని నిరూపించినా, భాగవతకృష్ణుడిలో రహస్య విద్యామూర్తిని ఉసాసించినా - అంతటా - వీరికి చుక్కానిగా నిశ్రేణికగా ఉపకరించినది శ్రీ అరవిందుల దర్శనమే. నాకు తెలిసినంతలో - ఈ దినుసు తాత్త్విక భూమిక నుంచి తెలుగు విమర్శను సుసంపన్నం చేసిన మనీషి శ్రీ సుప్రసన్నగారు ఒక్కరే. తుమ్మపూడి కోటీశ్వరరావుగారు మరొక్కరు. ఈ సంపుటిలోని వ్యాసాలన్నింటిలోనూ - చివరివి రెండూ మూడు వదిలేస్తే అంతటా ఇదే తాత్త్విక నేపథ్యం కనువిందు చేస్తుంది. అరవిందుల సావిత్రి గురించి, జె.కె. చింతన గురించి రెండు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వీటిని చదువుతుంటే ఆ మహానుభావులతో సుప్రసన్నగారు పొందిన భావోద్వేగతాదాత్మ్యం మనల్ని అబ్బుర పరుస్తుంది.
చరిత్ర, నిఘంటువు, ముద్రలు, పద్య విద్యారహస్యాలు- ఇలాంటివి కతిపయ సాధారణ వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఏ విశేషమూ లేదని కాదు, ఆరంభం లోని వ్యాసాలతో పోల్చినప్పుడు ఇవి సాధారణ వ్యాసాలు అనిపిస్తాయి. ఏ సంపుటిలోనైనా ఇది తప్పదు. ఇరవయ్యీ రత్నాలే అయినా చదివిన తరువాత మేలేరడం అనివార్యం.
వసుచరిత్ర విూద వీరు పరిశోధన చేశారు. అప్పటికి దొరకని ఒక కొత్త వెలుగు రేఖను వీరిప్పుడు ఆ కావ్యం విూదకు ప్రసరింపజేశారు. దీనికీ మూడు అంచెల అనుశీలన అవసరమన్నారు. అంతేకాదు- ఇందులో స్త్రీ పురుష సంబంధాల విపరీత ప్రవృత్తి, సంక్లిష్టత కనబడుతోంది అన్నారు. ఇది కొత్త కాంతి కిరణమే.
పాండురంగ మాహాత్మ్యం విూద రాసిన వ్యాసంలో వీరు చేసిన రెండు సమన్వయాలు - అలోచనామృతాలు. దివ్యక్షేత్రాలలో ఉన్న కొండనీ కోననీ కూడా దైవస్వరూపాలుగా కవులు ఎందుకు వర్ణన చేస్తారు? అనే సంశయానికి వీరు గొప్ప ఆధ్యాత్మిక సమన్వయం చేశారు. జీవనంలో భోగ స్థానంలోనికి త్యాగం, మమకార స్థానంలోనికి సర్వజీవ స్వాత్మభావం - నింపుతాయి ఈ వర్ణనలు అన్నారు. ఇలాగే - జీవితం సర్వతః పరిపూర్ణమైనా పుండరీకుడు మళ్లీ తపస్సుకు ఎందుకు పూనుకున్నాడు? అంటే, అతడి తపస్సు తనకోసం కాదనీ, ఈ ప్రకృతిలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం కోసమనీ, ఇది పరిపూర్ణతనుంచి పరిపూర్ణత వైపు ప్రయాణమనీ సమన్వయించారు. మన పుండరీకుణ్ని శ్రీమదరవిందుల సరసన కూర్చోబెట్టారు.
మనపాలిటి వరమై ఇవ్వేళ ఇలా మంచి సాహిత్య తాత్త్విక వ్యాసాల సంపుటిగా సరస్వతీ సమర్చనగా మనకు అందింది. శిరసా నమస్కరించి మనసా పఠించడమే మన తక్షణ కర్తవ్యం.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
