-
-
సాగరకెరటం
Sagarakeratam
Author: C. Umadevi
Publisher: J.V.Publications
Pages: 101Language: Telugu
జనార్ధనం ఫోను చేసి చెప్పాడు అబ్బాయి సుముఖంగా వున్నాడని. కస్తూరి పెల్లుబికిన ఆనందాన్ని బలవంతంగా అదిమిపట్టి 'అలాగా! సంతోషం అన్నయ్య గారూ! మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకొంటే లగ్నపత్రిక రాయించుకోవచ్చు. మళ్లీ మీరెందుకు ఫోను చేయడం. నేనే చేసి మంచిరోజు చెప్తాను' అంది క్లుప్తంగా.
''ఏమంటున్నారు?'' అని అడిగింది రాజ్యం ఆసక్తిగా.
''ఆ ఏముంది? మంచి రోజు చూసి చెప్తామంటున్నారు. ఏమిటో అబ్బాయి ఒప్పుకున్నాక వాళ్లలో ఉదాసీనత కనబడుతోంది.''
''మీరెప్పుడూ ఇంతే! అందుబాటులోకి వచ్చిన అవకాశం వదలను అంటారు. అవకాశం అందాక అనుమానపడుతుంటారు. ఆడపిల్ల పెళ్లివాళ్లు ఎక్కువ హైరానా పడవలసిన వాళ్లే కదా! అయినా కస్తూరిగారి మాట తీరే అంత. ఆ వేళ చూడలేదూ గుడిలో, మనసులో ఉన్నది చెప్తుంది. పర్యవసానానికి బాధపడదు. ఫలితమేదైనా సంబరంతో ఎగిరిపడదు. మనం ఏ సంగతీ చెప్పకుండా పదిహేను రోజులు గడిపేశాం. నిజంగా ఇంకెవరైనా అయితే ఎంతో ఆత్రుత, ఆందోళన పడేవారు. వాళ్లు డబ్బున్నవాళ్లు. మనలాంటి వాళ్లు కావాలంటే కోకొల్లలు.'' ఇన్ని రోజులనుండి ముభావంగా ఉన్న రాజ్యం కొడుకు సరేననగానే చక్కగా సర్దుకుపోయి మాట్లాడుతోందే! అని ఆశ్చర్యపడ్డాడు జనార్దనం.
తల్లిదండ్రుల బాధ్యతలకు ఫుల్స్టాపుండదు. పిల్లలు పుట్టినప్పటినుండి వారి ఆలనాపాలన మురిసిపోతూ చేసినా, ఊహ తెలిసిన పిల్లలకు తల్లిదండ్రులు మురిపాలకన్నా జాగ్రత్తలకు ప్రాధాన్యమిస్తారు. అందుకే జగన్ పెళ్లి విషయంలో అన్ని తర్జన భర్జనలయ్యాయి. కొడుకు పచ్చజెండా వూపాక జనార్ధనం ఆ వార్త చలపతికి ఫోన్ చేసి చెప్పాడు.
''చలపతీ! మళ్లీ జాంగ్రీయే తెప్పించమంటావా?''
''నేను అప్పుడే చెప్పానుగా. మీ ఇంట్లో మళ్లీ స్వీటు తినే ఛాన్స్ వస్తుందని. ఇంతకీ ఏమంటున్నాడు లక్ష్మీఅల్లుడు?'' నవ్వుతూ అడిగాడు చలపతి.
