-
-
సాహితీమూర్తులు - స్ఫూర్తులు
Saahitimoorthulu Spoorthulu
Author: Dr. Darla Venkateswara Rao
Publisher: Society & Education Trust
Pages: 176Language: Telugu
సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు ప్రతిస్పందించే కవులు, రచయితలు తమ అనుభవాలను, అనుభూతులను, తమ ఆలోచనలను తమకిష్టమైన ప్రక్రియలో అభివ్యక్తీకరిస్తుంటారు. వాటిలో వ్యక్తమైన ఆలోచనలు సమకాలీన సమాజానికి మార్గదర్శనం చేస్తే, మరికొన్ని ఆలోచనలు ప్రజల్ని తర్వాత కాలంలోనూ ప్రభావితం చేయవచ్చు. ఈ దృష్టితో తెలుగు సాహితీమూర్తుల కృషిని గమనిస్తే భిన్న మనస్తత్వాలతో కనిపిస్తారు. తాము పుట్టి పెరిగిన వాతావరణానికి అనుగుణంగానే తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్నవాళ్ళు కొందరైతే, దానికి భిన్నంగా ఆలోచించి, జీవించిన వాళ్ళు మరికొందరున్నారు. సాహిత్యమే ఊపిరిగా బతుకుతూ అనేక ప్రయోగాలు చేసి నూతనత్వానికి మార్గం వేసినవాళ్ళున్నారు. తమ వృత్తి వేరైనా, ప్రవృత్తిగా మొదలైన రచనావ్యాసాంగం ఆ తర్వాత కాలంలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
కొంతమంది వ్యక్తులుగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటే, మరికొంతమంది వారి భావాల ప్రభావం మనపై విస్తృతంగా కనిపిస్తుంది. ఇది ఇలాంటి వ్యక్తుల గురించి వివిధ సందర్భాల్లో రాసిన పరిశోధన పత్రాలు, వ్యాసాల్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంతో వెలువడుతున్నదీ పుస్తకం. సమాజాన్నీ, సాహిత్యాన్ని తమదైన దృష్టికోణంతో పరిశీలించే పద్ధతినీ, కావ్యపరమార్థాన్ని అవగాహన చేసుకునే విధానాన్ని పరిశోధకులు, విమర్శకులు, విద్యార్థులు గమనించడానికి ఈ వ్యాసాలు ఉపకరిస్తాయనుకుంటున్నాను.
- డా॥ దార్ల వెంకటేశ్వరరావు
* * *
విషయ వైవిధ్యంతో కూడిన వ్యాసాలు సాహితీ విద్యార్థులకు చక్కగా పాఠం చెప్తున్నట్లుగా సరళమైన భాషలో అందించటం విశేషం. అత్యాధునికమైన సాహిత్య విమర్శసూత్రాలూ, సిద్ధాంతాలూ గమనించి ఆ దృష్టికోణంతో దార్ల ఈ వ్యాసాలను రచించినట్లు స్పష్టంగా చెప్పగలను.
ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలన్నీ సదస్సులకోసం రాసినవే. సదస్సు ముగిసిన పిదప, ఆ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి, విమర్శలను పునః సమీక్షించి పత్రాన్ని మళ్ళీ సిద్ధం చేయటం నిజాయితీకల పత్ర సమర్పకుడు చేయవలసిన పని. ఈ వ్యాసాలన్నీ ఇలా చేసినవేనని ఆ వ్యాసాలలో కన్పించే నిఖార్సయిన రిసెర్చి మెథడాలజీ చెప్పకనే చెప్తుంది. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు- విద్యార్థులే కాదు కొందరైనా అధ్యాపకులూ దార్లని చూసి నేర్చుకోవాలని నా అభిప్రాయం. సీరియస్గా సాహిత్యవిమర్శ, పరిశోధన రంగాలలో పని చేసే వారికీ, సాహిత్య విద్యార్థులకీ ఈ పుస్తకం ఒక ‘ఫేస్ బుక్’ వంటిదని విన్నవించుకొంటూ- పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. దార్ల వారిని అభినందిస్తున్నాను.
- బేతవోలు రామబ్రహ్మం
