-
-
ఋతు సంహారము
Ruthu Samharam
Author: Desineni Venkatramaiah
Publisher: Desineni Anjaneyulu
Pages: 50Language: Telugu

తెలుగు అనువాదం: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య
తే. ఆరు ఋతువుల లక్షణ హార మనగ
అక్షరములందు రూపించి లక్షణముగ
ప్రేయసీ ప్రియ సంవాద ప్రేరణనగ
అనువదించితిని ఋతు సంహార మిట్లు!
* * *
ఋతు సంహార కధన మొక రచనా మాధుర్యమునకు వేదిక. ఆఱు ఋతువుల వైవిద్య భౌగోళిక, వాతావరణ, ప్రకృతి సౌందర్యముల మేళవింపు కవికి స్ఫూర్తిదాయకమగుట విశేషము. కవి కాళిదాసు ఋతు సంహారమును దాదాపు నాల్గవ - ఆరవ శతాబ్దములో సంసృతమున రచించగా, శ్రీ దేశినేని వేంకట్రామయ్యగారు ఋతు సంహారమును ఇఱువదవ శతాబ్దములో తెలుగులో రచించు నాటికి కేవలం 25 సంవత్సరముల ప్రాయము వాడు. అది వారు రచించిన మూడవ పద్యకావ్యము. వీరు ఋతు సంహారమునకు పూర్వము కుమార సంభవము మరియు మేఘ సందేశము పద్యకావ్యములకు శ్రీకారము చుట్టియుండిరి. పడుచుదనము ఉఱ్ఱూతలూగించు కాలమున ఋతుకాలముల వైశిష్ఠ్యములను ప్రేయసీ-ప్రియుల సంవాదముగా వర్ణనలు చేసి కవిగారు రసమాధుర్యమును పాఠకులకు కనువిందు చేస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కల్గించారు. వర్ణనల యందు బహుశా కవిగారి స్వానుభవములకును కొంతమేరకు అన్వయము జరిగియుండునని భావన. ప్రతి ఋతువునకుగల విశిష్టతపై దృష్టినిడి సంభాషణల వర్ణన చేయబడినది. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢములకు పరిమితమై వేసవికాలభాగమున నుండి ఎండలు బాగాకాయును. వర్ష ఋతువు శ్రావణ భాద్రపదములందు వర్షాకాలభాగమునుండి వర్షములు ఎక్కవగా కురియును. శరదృతువు ఆశ్వయుజ కార్తీకములందు వర్షాకాలము సన్నగిల్లి మంచి వెన్నెల రాత్రుల సమకూర్చును. హేమంత ఋతువు మార్గశిర పుష్యములు చలికాలభాగము కాగా మంచు ఎక్కువగా కురియును. శిశిరఋతువు మాఘ ఫాల్గుణముల చలికాలభాగము సన్నగిల్లి చెట్ల ఆకులు రాలుట ప్రత్యేకత. వసంత ఋతువు చైత్ర వైశాఖముల వేసవికాలభాగము అయి చెట్లు చిగిర్చి పూవులు పూయును. ఇట్లు ఆఱు ఋతువులకు నిర్ణీతమైన ప్రత్యేకతలుండగా కవుల ఊహలకును ఎన్నెన్నో వన్నెచిన్నెలు కలిగి వర్ణనలు శోభాయమానంగా తీర్చిదిద్దబడినవి ఈ కావ్యములో....
- దేశినేని ఆంజనేయులు
