ఈనాడు కథల్ని దళిత కథలని, స్త్రీవాద కథలని ప్రాంతీయ కథలని విభజిస్తున్నారు. సలీం రచించిన కథలు అలాంటి విభజనకు లొంగవు. ఈనాడు మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని తన దృక్కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నం చేశాడు రచయిత. ఇతను ఎన్నుకున్న ఇతివృత్తంలోనూ, కథాకథనంలోనూ కొత్తదనం ఉంది. పాఠకులను తన వెంట తీసుకెళ్ళగల్గే చక్కని శైలి ఈ రచయితకుంది. ఎలాంటి డొంక తిరుగుళ్ళు లేకుండా సూటిగా కథనంలోకి ప్రవేశించడం ఈ రచయిత ప్రత్యేకత. పాఠకులకు శాస్త్రీయ దృక్పథాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని కల్గించాలన్న అభినివేశంకూడా ఈ రచయితకుంది.
-ఆదివారం ఆంధ్రభూమి
ఇతని రచనల్లో మారుతున్న మానవ సంబంధాలు, డబ్బుచుట్టు గిరికీలు కొడుతున్న సామాజిక స్థితిగతులు, మహానగరాల విస్త్రుతిలో కనుమరుగైపోతున్న ప్రకృతి రామణీయకత దర్శనమిస్తాయి.
- విశాలాంధ్ర దినపత్రిక
ఈ రచయిత భావుకుడు. సౌందర్య సరస్తీరాల్లో ఆడుకుని అలసిసొలసి పోవడమే కాదు. జీవితంలోని నిష్ఠుర వాస్తవాల్ని కూడా గుర్తించగలిగిన వాడతను. కథ చెప్పే తీరులోని అందం రచయిత స్వంతం. ఈతని రచనాశైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది.
- ఆంధ్రభూమి వారపత్రిక
సలీం సాహిత్య స్వభావం మానవతావాదం. మానవ సంబంధాల్లోని మంచినీ, చెడునీ ఆయన కథలుగా మలుస్తారు. పతితుల పట్ల, బాధాసర్పదష్టుల పట్ల ఆయనకు అంతులేని జాలి. ఆ జాలి కరుణ ఆయన కథలన్నింట్లోనూ కన్పిస్తాయి. సలీం కథలు చదువుతుంటే మానవ స్వభావాలను ఎంత బాగా పట్టుకున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. వాదాల జోలికిపోని రచయిత సలీం. మనిషే ఆయల వస్తువు.
-ఆంధ్రజ్యోతి వారపత్రిక
