కాఫీ తాగారిద్దరూ.
బిల్లు సూర్యనారాయణ యివ్వబోయాడు.
వద్దని తానే పే చేసింది హరిణి.
''నేనోసారి సంజీవరెడ్డి నగర్ వెళ్ళిరావాలి. అక్కడ మా ఆంటీ ఒకామె వుంది. ఆమెకు మతి చలించింది. చూడాలని వుంది. వెళ్ళిరానా.''
''సంజీవరెడ్డి నగర్లోనా... అరే... నేనూ అటే వెళ్ళాలి. పదండి కలిసే వెళ్దాం''. ఇక తప్పించుకోలేకపోయింది హరిణి.
రెండు దఫాలు గమనించింది అతని చూపుల్లో దాగిన కోరికని. అయినా అంతగా పట్టించుకోలేదు హరిణి.
తనని అతను ఏమీ చేయలేడని హరిణి ధైర్యం.
కానీ అతనొక దారుణమైన కిల్లర్ అని, వేషాలు మార్చుతూ వుండే నరరూప రాక్షసుడనీ తెలీదు.
తెల్సివుంటే అది వేరే విషయం.
టాక్సీలో బయలుదేరారు యిద్దరూ.
హరిణిని ఎలా లొంగదీయాలా అనే ఆలోచన అతనిది.
హిరణ్యకు ఇప్పట్లో ప్రమాదం లేదు, అంతే చాలని హరిణి అభిప్రాయం.
వీళ్ళని చాలా తక్కువ దూరంలో ఒక కారు ఫాలో అవుతూంది. అందులో ఎవరున్నారో తెలుసుకోవడం కష్టం. చుట్టూ కూలింగ్ గ్లాసెస్ వున్నాయి. చాలా ఖరీదయిన కారది.
ఆ కారులో ఎవరున్నదీ హరిణికి తెలిసివుంటే సూర్యనారాయణతో కలిసి ప్రయాణం చేసేది కాదు.
