"మన నగరంలో మహా మంచి పెద్దమనిషిగా పేరుతెచ్చుకున్న వీరప్పన్ ఎటువంటివాడో, అతని సోదరులు ఎటువంటివారో మీకందరికీ బాగా తెలుసు. వీరప్పన్ సోదరుడైన మలైస్వామిని సిల్వర్ చంపినట్లు మనకు రిపోర్టు వచ్చింది... ఆ రిపోర్టులోని నిజానిజాలు గురించి చర్చించే అధికారం ప్రస్తుతం మనకు లేదు... ముందు అర్జంటుగా సిల్వర్‌ని అరెస్ట్ చేసి, జూడీషియల్ కస్టడీకి పంపిన తర్వాత ఆ కేసును గురించిన ఆరాలు తీయాలి..."
"అలా చేయలేని పక్షంలో స్వయంగా కక్షలు సాధించుకోవటానికి ప్రయత్నిస్తారు వారిద్దరూ. తమ గొడవల్ని వీధుల్లోకి తీసుకువచ్చి నగరాన్ని అల్లకల్లోలం చేస్తారు."
"వీరప్పన్‌కి ఎంత అంగబలం వుందో, నా అంచనాల ప్రకారం సిల్వర్‌కి కూడా అదే మోతాదులో వుంది పలుకుబడి... తమ తగాదాని వారిద్దరూ తమ అనుయాయులకు కూడా అంటించి పెద్ద గాంగ్ వార్ని సృష్టించేలోగా మనం జాగ్రత్తపడాలి..."
"మన వారందర్నీ ఎలర్ట్ చేయండి... క్రైమ్ వరల్డ్‌లో మనకున్న ఇన్ఫార్మర్స్కి హెచ్చరికలు పంపండి... ఇరవై నాలుగు గంటలలోగా సిల్వర్‌ని పట్టుకోలేకపోతే మాటపడక తప్పదు మనం... అసమర్థులని అందరి చేతా అనిపించుకోక తప్పదు..."
"దట్సాల్ మై ఫ్రెండ్స్ ... ఈ క్షణం నుంచీ ఈ సిల్వర్ కేసును నేను, ఇన్స్పెక్టర్ ఫిలిప్స్ కలిసి డీల్ చేస్తాము... మీకు తెలిసిన విషయాల్ని మాకు అందేటట్లు చూడండి. ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా..." అంటూ తన మాటల్ని ముగించి, మీటింగ్‌ని క్లోజ్ చేశాడు అంజాద్.
