-
-
రాచకొండ పద్మనాయకులు, సంస్థానాలు
Rachakonda Padma Nayakulu Samsthanalu
Author: Nagesh Beereddy
Publisher: Kakati Publications
Pages: 127Language: Telugu
చరిత్ర ఒక తరగని గని. ఎంత శోధించినా మరికొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఆధిపత్య సంఘర్షణల మయమే. సంఘర్షణలో గెలిచినవారు పరాజిత ప్రాంతాల చరిత్రను ధ్వంసం చేసి తమ చరిత్రను స్థాపితం చేయడం గతకాలమంతా జరిగింది. గతానికి సంబంధించిన ఆనవాళ్లు, ఆధారాలు, శత్రుశేషాలు లేకుండా చేయడం అన్నది విస్తృతంగా, కొన్నిసార్లు వికృతంగా జరిగింది. చాలా సార్లు అధికార సంఘర్షణ మాత్రమే గాక మతాల సంఘర్షణగా కూడా చరిత్ర నడిచింది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్దం, మళ్లీ శైవం, వైష్ణవం.. పరస్పర విధ్వంస పునాదులపై పొరలుపొరలుగా చరిత్ర పేరుకుపోయింది. తెలంగాణ పూర్వయుగపు చరిత్రకు సంబంధించి రేఖామాత్ర ఆధారాలు తప్ప, కచ్చితమైన కాలనిర్ణయంగానీ, రాజవంశాల అనుక్రమణికగానీ లభించలేదు. ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా లభించిన శాసనాలు, కథాసాహితీ గ్రంథాలు, పురాణాల ప్రస్తావనలే ఇప్పటి చరిత్రకు ఆధారాలు. ఆధారాలు లేనప్పుడు ఆధిపత్య శక్తులు తమకు తోచిన విధంగా చరిత్రను మల్చుకోవడం పరిపాటి. తెలుగునేల చరిత్రలో కూడా ఈ వైకల్యం కనిపిస్తుంది.
తెలంగాణకు సంబంధించి పురాచరిత్రకు తగిన ఆధారాలు లేవు. మధ్య యుగాల చరిత్రకు సంబంధించి కూడా ఎక్కువగా ఆధారాలు లభించలేదు. విషాదం ఏమంటే దక్కను పీఠభూమి ఉత్తర దక్షిణ భారత దండయాత్రలకు మధ్యన రంగభూమిగా మారడం. ఉత్తరాది రాజులు వింధ్య పర్వతాలు దాటిన తర్వాత మొదట విరుచుకుపడింది దక్కనుపైనే. దక్కను ధ్వంసం తర్వాతనే వారు ఇటు తూర్పునకు అటు మరింత దక్షిణానికి తమ దండయాత్రలు సాగించారు. సుల్తానులు, మొఘలులకు కూడా యుద్ధభూమి దక్కను పీఠభూమే. క్రీస్తు శకం 1300 తర్వాత దక్కను అంతా రక్తసిక్తమే. మొదట దేవగిరిలో యాదవ సామ్రాజ్యాన్ని నాశనం చేసి, తర్వాత ఓరుగల్లుపైకి వచ్చారు. రెండు చోట్ల అసాధారణ విధ్వంసం సాగించారు. సకల సంపదలను కొల్లగొట్టడమే కాదు, చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేశారు. కొంతకాలం దక్కనులోనే వారు తిష్టవేసి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. యాదవ, కాకతీయ రాజులతో యుద్ధం తర్వాత, దక్షిణాదిలో మనుగడ సాగించాలంటే హిందువులతో కలసి ఉండాలన్న సోయి వారికి వచ్చింది. తమ ఆస్థానాలలో హిందువులను పెట్టుకుని దక్షిణాదిలో ఇంకా మిగిలి ఉన్న హిందూ రాజ్యాలను ఖతం పట్టించే పన్నాగాలకు దిగారు. దక్షిణాది రాజ్యాలపైకి దాడులకు వెళ్లే కొద్దీ ముస్లిం రాజులలో మతసహిష్ణుత అనివార్యమైంది. అందుకే కర్ణాటక, తమిళనాడు, కేరళలల్లో చారిత్రక, ఐతిహాసిక, ఆధ్యాత్మిక ఆనవాళ్లపై విధ్వంసం ఎక్కువగా జరుగలేదు. క్రీస్తుశకం 1324లో ప్రతాపరుద్రుని కిరీటం పడిపోయిన తర్వాత నుంచి 1948 వరకు ముస్లిం రాజుల చరిత్ర తెలంగాణ చరిత్ర.
క్రీస్తుశకం 1331 నుంచి 1475 దాకా మలి కాకతీయులు, పద్మనాయకులు రాజ్యం చేసినప్పటికీ వారి చరిత్ర కూడా ఎక్కడా నమోదు కాలేదు. చివరకు మలి కాకతీయ రాజుల మధ్య తంపులు పెట్టి బహమనీలు తెలంగాణ నేలను మరోసారి రక్తసిక్తం చేశారు. రాజుకొండ, దేవరకొండ, ఓరుగల్లులను నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఇంకా అక్కడక్కడా మిగిలిఉన్న చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలు, జాగిర్దారీలు ముస్లిం రాజుల తాకిడికి బదాబదలై పోయాయి. ఆరు వందల సంవత్సరాలపాటు తెలంగాణలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. కుల చరిత్రలు, వంశచరిత్రలు, కొన్ని శాసనాలు, కొన్ని గ్రంథాలు తప్ప ఏవీ మిగలలేదు. త్రిలింగదేశాధీశ్వరులుగా సకల కీర్తులందుకున్న కాకతీయుల వైభవానికి సంబంధించి అరకొర పరిశోధనలే. పివి పరబ్రహ్మశాస్త్రిగారు నిజానికి ఎంతో శ్రమించి కాకతీయుల చరిత్ర రాశారు. అప్పుడున్న పరిస్థితుల్లో, ఆయనకున్న పరిమిత వనరుల్లో ఆయన చేసిన కృషి అమూల్యమైనది. కానీ చేయవలసింది ఇంకా చాలా ఉంది. శోధించవలసింది ఎంతో మిగిలిపోయింది. అందుకోసం పుస్తకాల సేకరణ, ఆధారాల సేకరణ, పురావస్తుశాలల శోధన అనేకం చేయాల్సి ఉంది. హైదరాబాద్, కోల్కత్తా, ఢిల్లీ, తంజావూరు, రాజమహేంద్రవరం వంటి చోట్ల గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో దాచిఉంచిన గ్రంథాలు, పత్రాలు, శాసనాలను శోధించడంతోపాటు విదేశాల్లోని ప్రముఖ గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో అన్వేషణ జరగాలి. ఆ అన్వేషణలో ఒక చిరు ప్రయత్నం నగేష్ బీరెడ్డి చేశారు.
- కట్టా శేఖర్ రెడ్డి
