శశి ఎంత ప్రయత్నించినా ఆగకుండా బయటికి వచ్చేశాయి కన్నీళ్ళు. ఆమె భుజంమీద తలను ఆనించి బావురుమన్నాడు ఒక్కసారిగా.
చిన్నపిల్లాడిని సముదాయించినట్లు గుండెలకు అదుముకొని సముదాయించింది శ్యామ.
"నువ్వు నాకు కనిపించినరోజునుంచీ నీ కథ అడుగుదామని అనుకుంటున్నాను. నీకు నువ్వుగా చెపుతావన్న నమ్మకంతో ఇంతవరకూ నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడయినా చెప్పు...నీ బాధల్లో పాలుపంచుకునే అవకాశం నాకు ఇవ్వు ” మృదుస్వరంతో అడిగింది.
తన గుండెల్ని తొలుస్తున్న బాధనంతా ఆమెకు చెప్పాడు శశి. తన తాత, ముత్తాతల్ని గురించి, తన తండ్రిని గురించి, కంటికిరెప్పలా కాపాడన చిన్నమ్మను గురించి, ఆమె ఆశయాన్ని గురించి, తననొక మనిషిగా చూడాలన్న తపనతో చేచేతులారా ప్రమాదాన్ని తెచ్చుకున్న మంజరిని గురించి అంతా చెప్పాడు.
“అందరి ఆశల్ని, ఆశయాల్ని వమ్ను చేశాను శ్యామా... ఏది జరగకూడదని మా అమ్మ అహర్నిశలూ అలమటించిందో అదే జరిగింది. పులులు నీళ్ళు తాగటానికి వచ్చే పులిమడుగు మాదిరి తయారయింది నా జీవితం.... ఎటు పోయినా, ఏది చేసినా పెద్ద పులులవంటి ప్రమాదాలు నన్ను వెతుక్కుంటూ వస్తూనే వున్నాయి.... రౌడీలుగా, రాక్షసులుగా పేరుపోందిన నా పూర్వీకుల అడుగుజాడల్లో నడవకతప్పటం లేదు....”
తన గుండెల మీదినించి తల ఎత్తకుండా చెపుతున్న శశిని మరింత గాఢంగా పొదవుకుంటూ అతని తలను ముద్దు పెట్టుకున్నది శ్యామ.
"నీ జీవితం పులిమడుగు కాకుండా నేను చూస్తాను... మీ అమ్మ ఆశయాలు వమ్ము కాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడి గొడవలు కాస్తంత చల్లబడిన తర్వాత మీ అమ్మగారి దగ్గిరికి నిన్ను నేను తీసుకువెళతాను ” అని చెపుతూ అతన్ని సరిగా కూర్చోబెట్టింది.
Not Impressed with plot. One time read if want to kill some hours.