-
-
'ప్రేమ'కి ముగింపు ఎప్పుడు ?
Premaki Mugimpu Eppudu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 205Language: Telugu
ఈ పుస్తకంలో, కథలూ - వ్యాసాలతో పాటు ఇంకా ఏ యే విషయాలున్నాయో అవన్నీ 'విషయ సూచిక' లోనే తెలుస్తాయి. దానిలో వున్న 2, 3 విషయాల గురించి...
• కథల్లో, 2వ కథ “సుమ ప్రేమ కథ." ఇందులో వున్న కథా వస్తువు కొంత కొత్తదే! ఇటువంటి వస్తువుని నేనెక్కడా చదవలేదు. కొన్ని ప్రాంతాల్లో ఆహారాల అలవాట్లు ఫలానా రకంగా తేడాలుగా ఉంటాయని తెలుసు. కానీ ఇది తెలిసింది కొన్నాళ్ళ కిందట! అప్పటి నించీ ఆ వస్తువుతో ఒక కథ రాయాలని ఆలోచన! సుమకి జరిగినట్టే, నా వయసులో నాకు జరిగి వుంటే, నేను కూడా సుమ లాగే ప్రవర్తించేదాన్ని అనుకుంటాను. అలా అనుకుంటున్నాను గానీ, అలాగే జరిగేదో లేదో! ఈ కథ, “స్వాతి" మాస పత్రికలో మొదట వచ్చినప్పుడు, ఈ కథ కొందరికి నచ్చడమూ, కొందరికి నచ్చక పోవడమూ, రెండూ జరిగాయి. ఇతర కథలకు కూడా, నచ్చడాలూ - నచ్చక పోవడాలూ జరుగుతూనే వుంటాయి. కానీ, ఈ “సుమ కథ' విషయంలో మాత్రం, 2 రకాలూ గట్టిగా కనపడ్డాయి. నాకైతే, ఈ కథ చాలా నచ్చింది. నేను రాశాను కదా అని కాదు; ఆ వస్తువుని బట్టి!
• "దేవుడు కూడా చచ్చిపోతాడా?" అనే 3వ కథ ఎలా పుట్టిందంటే, 'వినాయక చవితి' రోజుల్లో, వరసగా 10 రోజుల పాటు, ఇటు వుండే దుర్గం చెరువు దగ్గరికి ఎన్ని వినాయక విగ్రహాలు వస్తాయో! వాటిని అక్కడ చెరువులో పడేస్తారని తెలుసు గానీ, అదీ మా కళ్ళతో మేం చూడలేదు. రోజూ విగ్రహాల్ని అటు తీసుకుపోతోంటే, మా ఇంట్లో వున్న 10 ఏళ్ళ స్పార్టకస్, “నిన్న తెచ్చారుగా దేవుణ్ణి? ఇప్పుడు మళ్ళీ తెచ్చారేం?” అని ఒక రోజు ఆశ్చర్యపోతూ అడిగాడు. అంతే, అదే ప్రశ్న! దాని మీదే, ఈ కథ పుట్టింది! “దేవుడు చచ్చిపోతాడు” అని వాడికి చెప్పినా అర్ధం కాలేదు. వాడికి అర్ధమయ్యే విధంగా మేం చెప్పలేదు కూడా.
• వ్యాసాలు ఎన్నో వున్నాయి. అన్నిటి గురించి చెప్పనక్కర లేదు. “సత్య హరిశ్చంద్ర" ఒక వింత కథ! దీని మీద సమీక్ష ఎందుకు వచ్చిందో, ఆ సమీక్షనే చూస్తే తెలుస్తుంది. నిజానికి, ఒక మంచి విషయం కూడా వుంది, ఈ కథలో. ఈ కథ రాసిన రచయిత, ఆ మంచిని తెలియకుండానే రాసినా, అది మంచి విషయమే.
• స్త్రీ పురుష సంబంధాలు ఎలా వుండాలో, కోర్టులు రక రకాలుగా చెపుతాయి. పాత చట్టం ఒక రకంగానూ, కొత్త చట్టం ఇంకో రకంగానూ! ఆ చట్టాలు సవ్యంగా ఉన్నట్టేనా? అసలు, స్త్రీ పురుష సంబంధాలకి ఒక నీతీ జాతీ తేడాలు ఉండొచ్చా? అసలు, మనుషుల ప్రవర్తనలకు ఒక ‘సరైన తత్వం' అనేది ఉంటుందా? ఏదీ ఉండనక్కరలేదా? ఈ విషయాలు, అనేక సార్లు చెప్పుకుంటున్నవే. 'పాడిందే పాడరా' అన్నట్టు, అస్తమానూ ఎందుకు ఇది - అని, ఈ వ్యాసం రాయడం నాకసలు ఇష్టంగా లేదు. కానీ, పాఠకులు అడిగారు. వాళ్ళకి తెలియక కాదు; అయినా, వ్యాసంగా చదవాలని! సరే, ప్రయత్నిద్దాం అని రాశాను. మనం బూర్జువా లోకంలో వున్నామని గ్రహించుకోకపోతే, ఏదీ సరిగా అర్ధం కాదు. మనం మనుషులమో కాదో కూడా అర్ధం కాదు.
- రంగనాయకమ్మ
