-
-
ప్రశ్నమార్గ - 1
Prasnamarga 1
Author: P M Gopalachary
Publisher: Self Published on Kinige
Pages: 273Language: Telugu
‘ప్రశ్నమార్గ’ అనే ఈ గ్రంథం జ్యోతిషశాస్త్రగ్రంథాలలో ఆణిముత్యం. జాతిరత్నము. దీని కర్త విశ్వనాథ. తన పేరును రెండవ భాగంలో 32వ అధ్యాయంలో సూచించినాడు. సంస్కృతంలో ఒక నానుడి కలదు అది ‘తన్నేహాస్తి న తత్ క్వచిత్’ అన్నట్లు జీవితంలో అన్ని రంగాలకు చెందిన విషయాలను ఈ గ్రంథంలో వివరించి ఉన్నారు ఈ గ్రంథకర్త. ప్రశ్న జాతకాలు జన్మజాత కాలు రెండింటిని జోడించి పరిశీలించే విధానాన్ని ఏ గ్రంథంలోను చూడలేము.
మిగిలిన అన్ని వివరాలతో పాటు, ఈ ప్రథమ భాగంలో, దైవజ్ఞునకు పృచ్ఛకునకు ఉన్న ప్రత్యేక విధులు, స్వర శాస్త్రము, శకునాలు, దీప లక్షణము, బంగారు నాణెము ప్రాముఖ్యత, రాశి చక్రము త్రిస్ఫుట చతుష్ఫుటాదులు, సూర్య చంద్ర రాహు చక్రాలు, జీవ మృత్యు రోగ సూత్రాలు, ప్రశ్న కుండలి ద్వారా త్రికాల జ్ఞానము, సృష్టి స్థితి సంహార రాశులు, గుళిక ప్రాధాన్యత, మృత్యు యోగము, ఆయుర్వృద్ధి, ప్రశ్న దశాదులు, అష్ట మంగళం, ధ్వజ ఆది ఆయములు, ఉపగ్రహములు, ఆరూఢ రాశి, ఛత్రరాశి, వివిధ యోగాలు, ప్రమాణగుళిక, శని చంద్ర రవి గురు నిర్యాణరాశులు, మారక గోచారము, విపులముగా అష్టమ స్థాన విచారము, మృత్యుదాయక రోగము, దానిని అందించే గ్రహాలు, గ్రహ జన్య రోగ విచారము, ధీర్ఘకాలిక రోగము, ఆయుష్షును ఇచ్చే గ్రహం, ప్రశ్న ద్వారా రోగ విచారము, అపస్మారము మొదలైన మానసిక రోగాలు, రోగ ప్రారంభ సమాప్తి కాలాలు, ఆరోగ్య అవధి, ద్వాదశ భావ విచారము, మానసిక అనారోగ్య కారణాలు, శాంతులు, అసుర నాగ గంధర్వాదుల పీడ, విభిన్న రోగాలు, అష్టాంశసాధన, వివిధ వస్తువుల లాభము నాశము, యోగిని కాల మృత్యువు--వీటి గమనాలు మరియు ఫలితాలు యుగాల ప్రశస్తి, మొదలైనవి ఈ మొదటి భాగంలోని 16 అధ్యాయాలలో సవివరంగా చేర్చబడి ఉన్నాయి
ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రంథము శ్రీ హర్షుని నైషధంలాగా నారికేళ పాకములో సాగినది. కవులకు పద్య రచన సులభంగా సాగుతుంది. కథాగమనాన్ని బట్టి పద్య రచన తనకు నచ్చిన, వచ్చిన రీతిలో సాగించుకునే అవకాశం వారికి ఉంది. శాస్త్ర గ్రంథ రచన పద్య రూపంలో సాగడం చాలా కష్టం అధికమైన పదజాలము (Vocabulary) అవసరము. వాటిని కూర్చడంలో అత్యధిక సామర్థ్యం అవసరం. అందులో అవి చందస్సులో సరిగా ఒదగాలి. ఈ గ్రంథంలో కొన్ని శ్లోకాల పదవిభాగం కూడ మనకు అత్యంత కష్టంగా కానవస్తుంది ఆ విధంగా సాగింది ఈ పద్య రచన. నిజంగా ఈ గ్రంథకర్త ధన్యుడు. తల్లి తండ్రుల పేరు శ్రీ మహాదేవుడు అని తెలిపిన కవి తన పేరును తెలపకుండా ఉంటాడా? తన పేరును ‘విశ్వ’ అని 32వ అధ్యాయంలో చివరగా పేర్కొన్నాడు. ఇట్టి గ్రంథానికి తాత్పర్య రచన తెలుగులో చేసే అదృష్టం నాకు కలిగింది. ఇంతవరకు ఎవరు ఇలా చేయాలి అని అనుకోక పోవడం నా పూర్వ పుణ్య ఫలం.
ఈ రచనను గ్రంథకర్త శ్రీ విశ్వనాథ గారికే అంకితంగా సమర్పిస్తున్నాను
- పి. యం. గోపాలాచారి
