-
-
పిపాసి
Pipasi
Author: Kiran Kumar Satyavolu
Publisher: Vasireddy Publications
Pages: 216Language: Telugu
భోజనం పూర్తి చేసుకుని తనగదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు మహాదేవ. కపర్ది ఇంటిలో నుండి వెళ్లిపోవడంతో చాలా వరకు రాయడం తగ్గించేసాడు. ప్రొడ్యూసర్స్ కూడా మహాదేవని తొందరగా రాయమని చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. అతని పాట ఉంటే కథకు ఒకరకమైన బలం చేకూరుతుంది అని ఒక నమ్మకం. వంటవాడు డైనింగ్ టేబుల్ సద్దుకునే పనిలో ఉన్నాడు. అప్పుడే ఓ ఇద్దరు అక్కడికి వచ్చి “మహాదేవాగారు ఉన్నారా?” అనడిగారు.
“ఉన్నారు, పడుకున్నారు..” చెప్పాడు వంటవాడు.
“హ్మ్, ఎప్పుడు లేస్తారు?” అనడిగాడు వారిద్దరిలో చిన్నగా ఉన్నవాడు.
“ష్...” పరవాలేదు వెయిట్ చేస్తాము అన్నాడు పెద్దగా ఉన్నవాడు.
వంటవాడికి విషయం అర్థమైంది. ఏదో పాట రాయించుకోవడానికి వచ్చారని. పెద్దగా ఉన్నవాడు ప్రొడ్యూసర్ అని, మాములుగా ఉన్నవాడు డైరెక్టర్ అయి ఉంటాడని తొందరగానే పసిగట్టాడు. నిజానికి అతనికి అలవాటు అయిపోయింది.
“సరే కూర్చోండి..” అన్నాడు వంటవాడు.
అక్కడే గెస్ట్ హాల్లో కూర్చున్నారు. ఆ గది నిండా మహాదేవకి వచ్చిన అవార్డ్స్, వాటికి సంబంధించిన ట్రోఫీలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ కూర్చున్నాడు డైరెక్టర్. ప్రొడ్యూసర్ మాత్రం ఫోన్లో ఏవో చూసుకుంటూ కూర్చున్నాడు.
“తీసుకోండి..” అంటూ టేబుల్ మీద కాఫీ పెట్టేసి వెళ్ళిపోయాడు వంటవాడు. మహాదేవ కోసం వాళ్ళు గంటసేపు ఎదురు చూసారు. “ఇంకెంతసేపు సార్..” అన్నాడు కుర్ర డైరెక్టర్.
“ఉండవయ్యా బాబు.. అసలే చెప్పాపెట్టకుండా వచ్చాము.. పెద్దాయన ఏమంటాడో అని నేను టెన్షన్ పడుతుంటే”
“ఏమనరండి.. ఆయన మనసు మంచిది”
“హా, నువ్వే చెప్పాలి ఆయన గురించి...”
అప్పుడే మహాదేవ ఆ గదిలోకి వచ్చాడు. ఇద్దరు లేచి నుంచున్నారు. నమస్కారం అన్నారు. మహాదేవ ప్రతినమస్కారం చేసాడు. అతని కుర్చీలో కూర్చున్నాడు.
“నా పేరు కిరీటి సార్..” పరిచయం చేసుకున్నాడు డైరెక్టర్. ఈయన ప్రొడ్యూసర్ 'రాఘవ గారు’ చెప్పాడు పరిచయం చేస్తున్నట్టుగా, నెమ్మదిగా వినయంగా కుర్చీలో చిన్నగా కదిలాడు.
“చెప్పండి..?
“మేము తీయబోయే సినిమాకి మీరు పాటలు రాయాలి సార్” అన్నాడు డైరెక్టర్.
“నేనే ఎందుకు రాయాలి?” వెనక్కి వాలుతూ అడిగాడు.
“మీరు రాసిన పాటలన్ని సూపర్ హిట్ సార్.. అందుకే” అని చెప్పాడు ప్రొడ్యూసర్.
“అంటే.. నేను రాసుకున్న కథకు మీరు పాటలు రాస్తేనే న్యాయం చేయగలరని అనిపించింది సార్.. అండ్ మాది చిన్న సినిమా. మీరు నాలాంటి వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించారు, మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారని నమ్మకం కూడా ఉంది.”
“ఎన్ని పాటలు?”
“మొత్తం ఐదు పాటలు సార్..”
“సిట్యువేషన్ అన్నీ రాసి ఇవ్వండి. చూద్దాం..”
“సరే సార్. అండ్.. మీరు అడిగినంత ఇచ్చుకోలేం సార్. కొంచెం కన్సిడర్ చేయండి”
వాళ్ళని సూటిగా చూసాడు. ప్రొడ్యూసర్ అయితే పొమ్మంటాడేమో అని డిసైడ్ అయిపోయి మైండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
“అవన్నీ తరువాత, ముందు సిట్యువేషన్స్ ఇవ్వండి..” అని చెప్పాడు. ఇద్దరూ మహదానందపడిపోయారు.
“థ్యాంక్యూ సార్.. థ్యాంక్యూ సార్ " అని చెప్పారు ఇద్దరూ.
