-
-
పిల్లల బొమ్మల విక్రమ్ భేతాళ కథలు
Pillala Bommala Vikram Bhetala Kathalu
Author: Reddy Raghavaiah
Publisher: Swathi Book House
Pages: 40Language: Telugu
శివ పార్వతులిద్దరూ కుశల సంభాషణలలో వున్నప్పుడు పార్వతీదేవి ఎవ్వరూ విననటువంటి మంచి కథలు తనకు చెప్పమని శివుణ్ణి అర్థించింది. అవి ప్రపంచంలో మరెవరికీ తెలియకూడదని కూడ ఆమె షరతు విధించింది. ఆమె కోర్కె తీర్చడానికి శివుడు ఆనందంగా అంగీకరించాడు. తెల్లవారుజాము వరకు ఆమెకు అనేక కథలు చెప్పాడు. శివుడు ఆమెకు కథలు చెపుతున్నప్పుడు ఆయనను ప్రార్థించడానికి వచ్చిన బ్రాహ్మణుడొకడు శివపార్వతుల సంభాషణను విని ఒక మూలన నక్కి కథలన్నీ తాను కూడ విన్నాడు. ఆ తరువాత ఆ కథల్ని బ్రాహ్మణుడు తన భార్యకు కూడ చెప్పాడు. ఆమె తన ఇరుగు పొరుగువారందరికీ ఆ కథల్ని వినిపించింది. ఆ విధంగా ఆ కథలన్నీ ప్రపంచం మొత్తం తెలిసిపోయాయి.
ఆ విషయం గ్రహించిన పార్వతీదేవి ఒకరోజు ''ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని కథలు చెపుతానని చెప్పి, అందరికీ తెలిసిన కథలే చెప్పి నాతో అబద్ధమాడరు'', అని శివుణ్ణి నిలదీసింది. అప్పుడు శివుడు తన దివ్యదృష్టితో ఆ కథలు అందరికీ తెలియడానికి బ్రాహ్మణుడే కారణమని గ్రహించాడు. ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి, ''నేను రహస్యంగా చెప్పిన కథలు నువ్వు విని, అవి అందరిలో ప్రచారం చేసి తప్పు చేశావు, అందుకు నిన్ను శపిస్తున్నాను. నువ్వు దెయ్యంగా మారిపోతావు'' అన్నాడు.
శివుడి శాపం విన్న బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. ''దేవా! నన్ను క్షమించు. నేను దెయ్యంగా జీవించలేను. మళ్ళీ మనిషి రూపం పొందే విధం తెలియజేయి'' అని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడు , ''ఏదో ఒక రోజు విక్రమాదిత్యుడు అనే రాజు ఒక ముని కోర్కె తీర్చేందుకు నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఈ కథల్ని నువ్వతనికి చెప్పు. ఆ కథంలన్నీ విని నీ ప్రశ్నలకు అతను సమాధానం చెపుతాడు. ఆ తరువాత నువ్వు మళ్ళీ మనిషి రూపం పొందుతావు,'' అని శాప విమోచనం చెప్పాడు శివుడు. శివుడి మాటలు బ్రాహ్మణునిలో కొంత ఓదార్పును కలిగించాయి. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు దెయ్యంగా మారిపోయి అప్పటి నుంచి ఒక వృక్షంపై నివసిస్తూ వున్నాడు.
