-
-
పడమటి సూర్యోదయం
Padamati Suryodayam
Author: Itha Chandraiah
Publisher: Jatheeya Sahithya Parishath
Pages: 91Language: Telugu
''ఇవ్వాళ్ల వంట త్వరగా పూర్తయింది.కొన్ని కొత్తకవితలు రాశాను. నీకు వినిపిద్దామని పట్టుకొచ్చానురా. అందుకే అలస్యమైంది. పార్కింగులో నీ కారు చూసి నువ్విక్కడే ఉన్నావనుకున్నాను'' వివరణ ఇస్తూంటే చెయ్యి లాల్చీ జేబులో దూరింది. కొన్ని కాయితాలతో బయటికొచ్చింది. మరికొన్ని కాయితాలు సగం బయటికొచ్చి జేబులోంచే పార్కును చూస్తున్నాయి. కవి తన మీదికి సంధించబోయే అస్త్రశస్త్రాల్లా కనబడినై.
''పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తావెందుకురా?''
ప్రసాద్ భవాని దృష్టిలో కొన్ని పదాల కలయికనే కవిత్వం. నిద్రాహారాలు మానుకున్నా సరేగాని, కవిత్వం రాయడం మాత్రం మాననంటాడు. ఆ కవిత్వం వింటూంటే పైత్యం ప్రకోపిస్తుందంటారు లాక్షణికులు. ఎవరు విన్నా వినకపోయినా దేవీదాసుకు మాత్రం తప్పదు. ఆ కవిత్వం వినాల్సి వస్తుందనే భయం ఎందరో మిత్రుల్ని. ప్రసాద్ భవానీకి దూరం చేసింది. అయినా ధైర్యం వీడలేదు.
''నా కవిత్వం బ్రహాస్త్రమంటే ఒప్పుకుంటాను కాని నువ్వు పిచ్చుక వంటే మాంత్రం తప్పంటానురా. నీకు బోలెడంత ఓపిక ఉంది. లేకపోతే, నీ పెద్దకొడుక్కు అంతమంచి సంబంధం దొరికేదా? పైగా చిన్నకొడుకు పెళ్ళి ప్రయత్నంలో ఉన్నావు గూడా!'' దొరికిన శ్రోత పారిపోతాడేమోననే భయం ప్రశంసల వర్షం కురిపించింది.
''అవున్రా... నా ఓపికను పరీక్షించడమే నీ పనిగదా! అయినా... చిన్నప్పుడు తెలుగు క్లాసంటే తెగ భయపడే వాడివి, నీకు కవిత్వమెట్లా అబ్బిందిరా?''
''అదేరా గమ్మత్తు'' కొన్ని కాయితాలు విప్పి, మరి కొన్ని జేబులో పెట్టేశాడు. అవి పూర్తిగా జేబులో దూరలేదు. ''సినిమాల్లో, టీవీల్లో డైలాగులు,పాటలు వినీ వినీ... నేను గూడా కవిత్వం రాయగలననే ధైర్యమొచ్చింది. బస్... అంతే! కాయితం కలం అందుకున్నాను. అది శనివారం దుర్ముహుర్తం అనే విషయం గూడా మరిచి మొదటి కవిత బరబరా గీకేశాను.
అంతకుముందే ''కవితలతో కసరత్తు'' అనే టీ.వీ సిరియల్ గూడా చూశాను. రాసిన కవితను ఇంటిముందుకొచ్చిన ఓ బిచ్చగాడికి వినిపించాను. అది విని వాడెంత మురిసిపోయాడో తెల్సా?''
''వానికి బిచ్చమెంత వేసావురా?''
''పోపు డబ్బా వెతికి ఓ వెయ్యిరూపాయల నోటు అడ్వాన్స్‌గా వేశాన్రా, అదే కవితను మళ్లీ మళ్లీ చదివి నాలుగైదుసార్లు వినిపించానురా. ఆ తర్వాత కవితా వ్యవసాయ క్షేత్రములో విజృంభించాననుకో...''
''వాడో వెధవ. అంతసేపు ఈ పార్కులో అడుక్కుంటే అంతకంటే ఎక్కువే దొరికేది. వాని నిజాయితీకి నా జోహార్లురా...'' అందామనుకున్నాడు గాని ప్రాణస్నేహితుడు ఉసూరుమాంటాడని ఊరుకున్నాడు, పైకి మాత్రం. ''ఏ జన్మలో ఎవరి మనసు నొప్పించానో, ఈ జన్మలో నీ కవిత్వం వినాల్సివస్తుంది. అయినా... రోట్లో తలకాయ పెట్టేసి రోకలి దెబ్బకు భయపడితే కుదురుతుందా!...ఊ.... కానీ...'' ధైర్యంగా పెదాలు చప్పరించాడు.
