-
-
పాకుడురాళ్ళు
Paakuduraallu
Author: Ravuri Bharadwaja
Pages: 476Language: Telugu
‘పాకుడురాళ్ళు’ నవలలోని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, సామాన్య పాఠకునికి చాలా కొత్తగా కనిపిస్తాయి. వాటిని అభివ్యక్తం చేయడంలో రచయిత ప్రదర్శించిన చొరవ, తెగువ అభినందనీయమైనవి. ’దారుణా ఖండల శస్త్రతుల్యము’ లైన వాక్యాలతో శ్రీ భరద్వాజ ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం అపూర్వంగా ఉన్నది. తను చెప్పదలచుకున్నదేదో బలంగా చెప్పగల బహుకొద్దిమంది రచయితలలో భరద్వాజ వొకరు. ఆయన విమర్శ, వ్యక్తిగతంగా ఉండదు. ఆ వ్యక్తుల తాలూకు సమాజమూ, అందులోని వాతావరణమూ, ఆయన విమర్శకు గురి అవుతాయి.
అట్టడుగునుండి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలిని మంజరి. నీగ్రో బానిసగా జన్మించి, అమెరికా చరిత్రనే మార్చివేసిన ‘జార్జి వాషింగ్టన్ కార్వర్’, మామూలు కార్మికుడుగా బ్రతుకు ప్రారంభించి, కార్ల సామ్రాజ్యాధిపతిగా పేరు సంపాదించిన ’వాల్టన్ పెర్సీ క్రిజ్లర్’, మట్టిలో పుట్టి, మణిమందిరాలలో నివసించిన ’మార్లిన్ మాన్రో’- వీరందరూ అనుసరించిన మార్గాలనే మంజరికూడా అవలంబించి తమ ధ్యేయాన్ని సాధించుకోవడానికి నిరంతర కృషి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమూ, వారి విజయాలకు కారణాలు. మంజరికూడా ఈ రెండు సూత్రాలనూ అక్షరాలా పాటించింది. గుంటూరు గుడిసెల్లో తిరిగి, బొంబాయిలోని చలువరాతి మందిరం చేరిన ఈ మధ్య కాలంలో- మనకొక విచిత్రమైన చలనచిత్ర ప్రపంచాన్ని చూపించింది.
సినిమారంగం ఆధారంగా, తెలుగులో చాలా చిన్న కథలొచ్చాయి గానీ, పెద్ద నవలారూపంలో రావడం మాత్రం ఇదే ప్రథమం.
- ఆలపాటి వెంకట్రామయ్య
