-
-
పి. చంద్రశేఖర అజాద్ కథలు
P Chandra Sekhara Azad Kathalu
Author: P. Chandra Sekhara Azad
Pages: 136Language: Telugu
నా పద్ధతి పూర్తిగా మార్చుకోలేకపోయినా, కొన్ని ప్రత్యేక విషయాల మీద రాయాలనుకున్నప్పుడు కాస్త ఆలస్యం చేసేవాడిని. మరికొంత పరిణతి వచ్చాక రాద్దామని. ఏది ఏమైనా జీవితం తాలూకు రకరకాల అనుభవాలు నాలో ఓ ధిక్కారస్వరాన్ని సృష్టించి, పెంచి పోషించాయి. నేను ఆ పెద్దాయనతో వాదానికి దిగలేదు గానీ సరస్వతి పలకడం అనే పదాన్ని ఆమోదించలేక పోయాను.
నా రచనకు వస్తువు ప్రజలు. వారి అనుభవాలు. నేను విరివిగా రాయడం వల్ల నాకో శైలి ఏర్పడిందేమో. అంతే తప్ప నా రచనలకీ, 'సరస్వతి'కీ సంబంధం లేదు.
నిజానికి నా అవసరాల కోసం నేను రచనలు చేసాను. కథల కొచ్చే పారితోషికం ఎంత తక్కువయినా అప్పట్లో అది నాకు ఎక్కువే. తర్వాతి కాలంలో నవలలు రాసాను. ఓ పెద్ద మొత్తం చేతికందినప్పుడు ఏదోక వస్తువు కొన్నాను. నా రచనలకు పేరు వచ్చినప్పుడు నా గురించి మాట్లాడుకోవాలనీ, నా రచనల మీద చర్చ జరగాలనీ రాసాను. అందుకోసం కొత్త విషయాలను ఎన్నుకున్నను. నేను నమ్మని వాటిని కూడా సంచలనం కలిగించడానికి రాసాను. ఆ రకంగా డబ్బు కోసం, కీర్తి కోసం రాసాను. నన్ను 'పలికించేవి' అవే.
నేను కేవలం రచయితగానే మిగల్లేదు. వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పాను. టీవీల్లో కనిపించాను. నాకు ఉత్తరాలు వ్రాసేవారూ, ఫోన్లలో పలకరించేవారూ, అభిమానిస్తున్నామని చెప్పేవారూ పెరిగారు. నా రచనల తాలూకూ వేగం జీవితంలోనూ ప్రవేశించింది. అందుకే నా గురించి నేను పరిశీలించుకునే తీరిక దొరకడం లేదు. ఇప్పుడీ స్థితి వచ్చింది. నేను నిన్నతి సారళ్యాన్ని కోల్పోయానా? వేగాన్ని, స్పందించే గుణాన్ని కోల్పోయానా? ఇంక రచనలకు స్వస్తి చెప్పి 'విశ్రాంతి' తీసుకునే సమయం వచ్చిందా? ఇంక సభలకూ, ముందుమాటలకే పరిమితం కావాలా? ఈ స్తబ్ధతకు కారణం ఏమిటి?
