-
-
ఒకటవ తరగతి తెలుగు వాచకము
Okatava Taragati Telugu Vachakamu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 64Language: Telugu
50, 60 ఏళ్ళ నాటి ఒకటో తరగతి వాచకాల్ని తీసుకుంటే, వాటిలో కూడా కొన్ని పొరపాట్లు వున్నా, చదువు నేర్పే క్రమం అంతా వాటిల్లో సరైన పద్దతిలోనే వుండేది. మొదట 'అక్షరమాల'ని చూపించి, తర్వాత మాటలూ, ఆ తర్వాత వాక్యాలూ చెప్పే క్రమం అది. 'మాటలు' నేర్చుకోడంలో కూడా, ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క అచ్చు శబ్దాన్నీ, గుణింతం గుర్తుల్లో నించి ఒక్కొక్క గుర్తునీ నేర్చుకుంటూ వెళ్ళే క్రమం అది. కానీ, క్రమ క్రమంగా ఆ సరైన పద్ధతికి బదులు, 'నూతనత్వం' పేరుతో, మొట్టమొదటే కవిత్వాల్నీ, వాక్యాల్నీ చూపించి, ఆ వాక్యాల్లో వున్న అక్షరాలతో మాత్రమే వచ్చే మాటల్ని నేర్పే తప్పుడు పద్ధతి పుట్టుకొచ్చింది. అంతే కాదు, అక్షరాల్ని, వాటి ఆకారాల్ని బట్టి కొన్ని భాగాలుగా విభజించి, ఒక్కొక్క భాగంలోకి వచ్చే అక్షరాలతో మాత్రమే మాటలు చెప్పే వికృత పద్ధతి కూడా తలెత్తింది. సరైన పద్ధతిని వదిలేస్తే, ఆ తర్వాత ప్రారంభించే ఏ పద్ధతైనా తప్పుడు పద్ధతే అవుతుంది. దాని వల్ల చదువు నేర్పడంలో అనేక సమస్యలు పుట్టు కొస్తాయి.
కొన్ని ప్రభుత్వ వాచకాలూ, కొన్ని ప్రైవేటు వాచకాలూ 'కొత్తదనాల' పేరుతో అనేక తప్పుడు పద్ధతులతో కిక్కిరిసి పోయి వున్నాయి. ఈ రకంగా, తప్పు పద్ధతులతో వున్న వాచకాలు, చిన్న పిల్లలకు చదువులు నేర్పడానికి ఉపయోగ పడవు.
కాబట్టి ఇప్పుడు మనం చేసుకోవాలసిన మార్పు ఏమిటంటే, మళ్ళీ వెనకటి మంచి పద్ధతులనే అనుసరించడం. ఏది సరైన దైతే అదే మంచిది. సరైన దాన్ని ఇక మార్చ నక్కరలేదు. సరైన దాన్ని ఏ మాత్రం మార్చినా అది మళ్ళీ సరికాని విధానం అయి పోతుంది.
ఈ వాచకం రాయడంలో నేను పాటించిన పద్ధతి ఏమిటంటే: (1) 'అక్షర మాల'లో నించి కొన్ని అనవసరపు అక్షరాల్ని వదిలి వెయ్యడమూ, (2) మొట్ట మొదటే అన్ని రకాల శబ్దాల మాటల్నీ ఇచ్చే పద్ధతిని వదిలి వెయ్యడమూ, (3) వెనకటి మంచి వాచకాల్లో, పాఠాలు ఇవ్వడంలో వున్న సరైన క్రమాన్ని అనుసరించమూనూ. - ఇంత కన్నా నేను కొత్తగా చేసిందేమీ లేదు.
- రంగనాయకమ్మ
