-
-
ఒక సంస్కర్త భార్య ఆత్మకథ! - ఒక పాటల కవి భార్య మనోవేదన!
Oka Samskarta Bharya Atma Katha Oka Patala Kavi Bharya Manovedana
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 141Language: Telugu
ఈ పుస్తకంలో, కనపడే గాధలు నేను రాసినవి కావు. ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా, రాసినవి. అవి, ప్రచురణల కోసం రాసిన రచనలు కావు. నేను చదవాలని, వారు నాకు అందించిన యధార్ధగాధలే. నేను చేసింది, ముందు మాటలూ, చివరి మాటలూ, రాయడం వరకే. ఆ ఇద్దరు స్త్రీలకూ, నాకూ, కలిగిన పరిచయాల గురించి చెప్పడం కూడా.
ఆ ఇద్దరు స్త్ర్రీల చరిత్రలూ, భార్యలుగా అవమానాలు భరించిన గాధలే. ''చింతామణి'' నాటకం రాసిన రచయిత కాళ్ళకూరి నారాయణరావు, ''భార్యగా వుండమే భార్య తప్పు'' అని, సమాజంలో వున్న ఒక నగ్న సత్యాన్ని స్త్రీల పట్ల ఆదరంతో చెపుతాడు. అది, స్త్రీలను హేళన చెయ్యడం కాదు; స్త్రీలకు, ఒక సత్యాన్ని చూపించడం! ఆ రచన, వ్యభిచార సంబంధాల్నితీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నించి పుట్టుకువచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా, భార్యలవి అయినా, అవి, కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్నీ, ధ్వంసం చేసే నేరాలే.
ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టుకధలు కావు; సాహిత్య కల్పనలు కావు. యధార్ధంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్బాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ళ తరబడీ భద్రపరిచి వుంచాను. ఇప్పటికి వీటిని బైట పెడుతున్నాను.
ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనపితే చాలు. తెలుసుకోవలిసింది వాటినే.
- రంగనాయకమ్మ, 15-11-2015.
