-
-
ఒక ఇల్లాలి కథ
Oka Illali Katha
Author: G.S. Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 176Language: Telugu
శ్రీమతి జి.ఎస్. లక్ష్మి గారి 'ఒక ఇల్లాలి కథ' నవల స్వతంత్రం రాకముందు అంటే 1935, 40 ప్రాంతాల సామాజిక స్థితిగతులు ఎలా వుండేవో చెపుతూ, ఆనాటి మధ్యతరగతి ఇల్లాళ్ల సంసార స్థితిగతులని చక్కగా చిత్రించారు.
అత్తవారింట్లో, ఉమ్మడి సంసారాల్లో అవిశ్రాంతంగా వంచిన నడుం ఎత్తకుండా వంటింట్లో పడి చాకిరి చేయడం తప్ప తమకి ఒక వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా, తన ఉనికి మరిచిపోయిన ఇల్లాళ్ల బతుకులు ఎలా వుండేవో చాలా సహజంగా, సరళంగా మొదలుపెట్టిన దగ్గిర నుంచి చదివించే రచనతో పాఠకులని ఆకట్టుకుంటుంది. అద్భుతమైన మలుపులు, ఉత్కంఠని రేకెత్తించే సంఘటనలు లేకుండా అతి సహజ రీతిలో మన అమ్మమ్మల, అమ్మల పాట్లు కాగితం మీద చూస్తున్నట్టు అనిపించే రీతిలో కథనం వుంది.
ఈ రచన ఈనాటి యువత చదివితే... ఈ తరంలో తామెంత పురోగమించారో అర్థం అవుతుంది. పిల్లల్ని కంటూ, సంసారం అనే సాగరం యీదుతూ ఆ తరం నుంచి కాలక్రమేణా ఒక తరంలో గడపదాటి బయటికి వచ్చి చదువుని మొదలుపెట్టి తర్వాత తరాల్లో పురుషునితో సమంగా చదువు, ఉద్యోగాలు చేస్తూ ఇటు ఉద్యోగినిగా, అటు యిల్లు సంబాళించుకుంటూ రెండు పాత్రల్ని సమర్థవంతంగా పోషించే స్థాయికి ఎదిగిన మగువలు... ఈ తరంలో ఎంత ప్రగతి సాధించారో అర్థం అవుతుంది. తమ ఉనికి, వ్యక్తిత్వం చాటుకునే ప్రయత్నంలో వారు పడిన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నివున్నా చెప్పుకోదగ్గ ప్రగతి వారి జీవితంలో కనిపించడం ముదావహం.
- డి. కామేశ్వరి
