-
-
ఒక దేశం రెండు పద ప్రయోగాలు
Oka Desam Rendu Pada Prayogalu
Author: Vamsheekrishna
Publisher: Palapitta Books
Pages: 112Language: Telugu
'జీవితం ఒక అసంపూర్ణ కవిత' అని బలంగా నమ్మే వంశీకృష్ణ కవి, కథకుడు, విమర్శకుడు. 1990లలో రచనా వ్యాసంగం ప్రారంభించి ఇప్పటి వరకు నాలుగు కవిత్వ సంపుటాలు, రెండు కథాసంపుటాలు, ఒక ప్రేమలేఖల సంపుటి వెలువరించారు. 'ఒక దేశం రెండు పద ప్రయోగాలు' వంశీకృష్ణ అయిదో కవిత్వ సంపుటి. ప్రపంచీకరణ తరువాత ఆర్థిక పరిణామాలు నేపథ్యంగా కవిత్వం, విమర్శ రాసిన తొలి సృజనకారుల్లో ఆయన ఒకరు. వర్తమాన సాహిత్య రంగంలో వంశీ నిత్యకృషీవలుడు. విస్తృతమయిన అధ్యయనం, సునిశితమయిన విశ్లేషణ, లోతయిన విమర్శ, నిండయిన భావుకత వంశీకృష్ణ ముద్ర.
'ఒక దేశం రెండు పద ప్రయోగాలు'ను వంశీకృష్ణ మూడు అధ్యాయాలుగా విభజించి ప్రవేశపెడుతున్నారు. దేవుడి పాలనలో... శీర్షిక కింద ఇరవైమూడు కవితలు, ఆమెలో ఒక పూలతోట ఉండేది శీర్షిక కింద పదిహేను కవితలు, చిత్రనిద్ర శీర్షిక కింద పన్నెండు కవితలు ఉన్నాయి. మొదటి అధ్యాయం ప్రధానంగా ప్రపంచీకరణ, రాజ్యహింస, తెలంగాణ వంటి రాజకీయార్థిక అంశాలతో ఉండగా, రెండో అధ్యాయంలో మానవ సంబంధాలు, తాత్వికదృష్టి, పురాస్మృతి వంటి అంశాలు, మూడో అధ్యాయంలో తల్లిదండ్రులకూ శిశువుకూ మధ్య అనుబంధం వ్యక్తీకరణ పొందాయి.
జీవనమూల్యాల్ని కాపాడే మార్పుల పక్షాన నిలబడే సృజనజీవి వంశీ.
* * *
చరిత్ర ఎన్నిసార్లయినా
పునరావృతం కానీ
స్త్రీ, పురుషుడికి ఎప్పుడూ అద్భుతమే
చరిత్ర ఎన్నిసార్లయినా
పునరావృతం కానీ
నియంతృత్వం, ప్రజాస్వామ్యం ముందు దిగదుడుపే
స్త్రీలాగే ప్రజాస్వామ్యం కూడ
కుసుమ కోమలం
స్త్రీ అంటే కేవలం
రక్తమాంసాలున్న ఒక మామూలు మనిషి కాదు.
జాతిని దీప్తవంతం చేసే
ఒక జీవద్భాష... ఒక సంస్కృతి.
ప్రజాస్వామ్యం అంటే
ఒక రాజకీయ విధాన నిర్ణాయక ప్రకటన కాదు.
ఒక జీవన విధానం
ఒక సహిష్ణుతా శిఖరం.
