-
-
నువద్ది
Nuvaddi
Author: Madhukar Vydhyula
Publisher: Kakati Publications
Pages: 124Language: Telugu
ప్రపంచీకరణ తర్వాత కలం పట్టిన సాహిత్య కళా జీవులంతా నోస్టాల్జియా, ప్రేమల చేత తీవ్రంగా బాధింపబడ్డవారే. 2000 తర్వాత సగటు మనిషి బతుకు మరింత ఛిద్రమైపోయింది. గత దశాబ్దం ఆధునిక మానవ ప్రయాణంలో ఒక గడ్డు కాలం. తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ, తన కంట్లో తన వేలును పెట్టుకుంటూ, తన నేలను తానే పొక్కిలి పొక్కిలి చేసుకుంటూ 'ముందుకు' పోతున్నాననుకుంటున్న మనిషి నిజానికి ఏ కనిపించని లోయల్లోనో కూరుకుపోయాడు. హృదయమున్న రచయితలంతా ఈ సంవేదననంతో తాము ఎంచుకున్న ప్రక్రియల్లోకి తీసుకొచ్చి కాలపు వక్రతలను రికార్డు చేస్తూ వస్తున్నారు. కవిత్వంలో ఇమడని జీవిత విస్తారతను, నవలల్లో చెప్పలేని క్లుప్తతను కథ చాలా ఒడుపుగా పట్టుకుంటుంది.
జీవితం పొడుగూత పర్చుకున్న సంఘర్షణలను, సన్నివేశాలను, శకలాలను కథంత బలంగా మరో ప్రక్రియ చెప్పలేదు. తెలుగు కథా ప్రయాణంలో ఇప్పటిదాకా సుమారు రెండు లక్షల కథలైనా వచ్చి ఉంటాయి. ఇన్ని కథలు వచ్చినా ఇంకా చెప్పాల్సిన మానవ జీవిత కోణాలెన్నో మిగిలే ఉన్నాయి. 90వ దశకం తర్వాత తెలంగాణ కథ ఇంకొంత నిశిత దృష్టితో ముందుకుపోతోంది. శరవేగంగా మారుతూ వస్తున్న సమాజాన్ని, దాని మలుపులను, మానవ స్వభావాన్ని, రోజురోజుకూ మనిషి చుట్టూ పర్చుకుంటున్న సంక్లిష్ట తను చాలా సమర్థవంతంగా తెలంగాణ కథ తనదైన దృష్టితో వ్యక్తీకరిస్తూ చాలా బాధ్యతాయుతంగా సాగిపోతోంది.
అట్లా సరికొత్త తోవలో ముందుకుపోతోన్న తెలంగాణ కథను ఎంతో మంది కథకులు తమ కథ తంగేడు పువ్వులను పర్చుకుంటూ, కొత్త కాంతులనద్దుతూ తమ వెంట తీసుకుపోతున్నారు. అలా ఇప్పటి తెలంగాణ కథా సందర్భానికి అంది వచ్చిన కథా కాంతిపుంజం మధుకర్ వైద్యుల.
పాత్రికేయుడిగా నిరంతరం అక్షర సాగు చేస్తూనే అప్పుడప్పుడు తన లోచూపు నుంచి బయటకు తీసిన కథల పంట ఈ 17 కథలు. గత కొంత కాలంగా మన చుట్టూ జరుగుతున్న విధ్వంసానికి అందరం గాయపడుతూనే ఉన్నాం. అయితే కొంత మంది రచయితలు మాత్రమే ఆ గాయాల సలపరాన్ని కథలుగా మలుస్తూ వస్తున్నారు. మధుకర్ వైద్యుల కూడా అలాంటి నొప్పితోనే, అలాంటి దుఃఖంతోనే రాసిన కథలివి.
- డా. వెల్దండి శ్రీధర్
