-
-
నూరు జ్ఞాన వచనాలు
Nooru Gnana Vachanalu
Author: Benjamin Schultz
Publisher: Vasireddy Publications
Pages: 116Language: Telugu
తెలుగు భాషకు తమిళ భాషకు వున్నంత ప్రాచీన చరిత్ర వుంది. 17వ, 18వ శతాబ్దాలలో తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుగులో అన్ని వ్యవహారాలు సాగుతున్న దశలో తెలుగు పుస్తకం అచ్చు యంత్రంమీద ముద్రితం కావడం.. అదీ.. జర్మనీ దేశంలో అచ్చుకావడం.. ఎంత ఆశ్చర్యకరం!
డానిష్ మిషనరీకి చెందిన బెంజిమన్ షుల్జ్ తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేసిన మొదటి యూరోపియన్. ఈయన తెలుగు అక్షరాలను అచ్చుకు వీలుగా తయారు చేయించి 1746-47 మధ్య కాలంలో జర్మనీలోని 'హలే' పట్టణంలో కొన్ని తెలుగు పుస్తకాలను ముద్రించారు. కొంతమంది పరిశోధకులు ఈ కాలాన్ని 1646-47గా కూడా పేర్కొంటున్నారు. అంత ప్రాచీన కాలంలో అచ్చులో వెలువడిన ఆ తెలుగు పుస్తకాలలో 'నూరు జ్ఞాన వచనాలు' ఒకటి. క్రైస్తవ మత సంబంధమైన ఈ పుస్తకం ఒక కాపీ జర్మనీలో వుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
చారిత్రక విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన ఈ తొలి తెలుగు ముద్రితంను కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్ మిషనరీ గ్రంథాలయంలో భద్రపరచడం తెలుగుజాతికి జరిగిన గొప్ప ఉపకారం. యూరోపియన్ ప్రపంచానికి 18వ శతాబ్దంలోనే తెలుగుభాషను పరిచయం చేసిన షుల్జ్ జర్మనీలో అచ్చువేసిన తెలుగు పుస్తకం టైటిల్స్ ను రోమన్, లాటిన్ భాషలలో ప్రచురించారు. జర్మనీలో మొదటి తెలుగు పుస్తకం అచ్చు అయిన 50ఏళ్ల తర్వాత భారతదేశంలో తెలుగు ముద్రణ ప్రారంభం అయింది. 1798లో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన విలియం కేరి, ప్రింటింగ్ ప్రెస్ కొని 1800లో శ్రీరాంపూర్ కు తీసుకువచ్చాడు. మద్రాస్, శ్రీరాంపూర్ లలో తెలుగు ముద్రణకు స్వర్ణకారులైన పంచానన్, మనోహర్ లు ఎంతో కష్టంతో అచ్చు అక్షరాలను కూర్చారు. దీనిని బట్టి జర్మనీలో మొట్టమొదటి తెలుగు పుస్తకం అచ్చురూపం సంతరించుకోవడానికి ఎంతటి దీక్షతో కూడిన కృషి జరిగిందో ఊహించవచ్చు.
మొదటి తెలుగు అచ్చు అనవాళ్లని తడిమి చూడడానికి, అనాటి తెలుగు అక్షరాలను అచ్చులో చూస్తూ అనుభూతి పొందడానికి ఈ తరానికి అందిస్తున్న ఒక అపురూప కళాఖండం ఈ నూరు జ్ఞానవచనాల పునర్ముద్రణ.
- పబ్లిషర్స్
గమనిక: " నూరు జ్ఞాన వచనాలు " ఈబుక్ సైజు 11.9mb