-
-
నిత్య జీవితంలో మూఢనమ్మకాలు
Nitya Jeevitamlo Moodhanammakalu
Author: Dr. V. Brahma Reddy
Publisher: Victory Publishers
Pages: 172Language: Telugu
'నమ్మకాలు మనిషి పుట్టినప్పటి నుంచీ వున్నాయి. అంతరించే వరకూ వుంటాయి' అని చప్పరించే వాళ్ళున్నారు. 'నమ్మకాల మీద యుద్ధం అంటే నీడతో యుద్ధమే' అని సిద్ధాంతీకరించే వారూ వున్నారు. కాని నమ్మకాలు జీవితావసరం. నమ్మకాలు ప్రయోగదశకు ముందుంటాయి. ప్రయోగం పూర్తయ్యాక ఆ పరిశీలనాంశం సత్యముగానో, అసత్యంగానో తేలిపోయిందనుకోండి. తేలాక సత్యాన్ని సత్యంగా నమ్మినా, అసత్యాన్ని అసత్యంగా నమ్మినా, ఆ నమ్మకం వాస్తవానికి అనుగుణ్యంగా ఉన్నట్లే. కాని అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యం గానూ నమ్మితే దీన్ని మూఢనమ్మకం అంటాము. జనవిజ్ఞాన వేదిక మూఢనమ్మకాలను పోగొట్టాలంటుంది. నమ్మకాలను కాదు.
మనిషి జీవితం నిరంతర పోరాటమయం. ప్రకృతితోనూ, ఆధిపత్య శక్తులతోనూ మాత్రమే కాదు ఒకానొక చారిత్రక భౌతిక పరిస్థితులవల్ల దాపురించిన భావజాలంతోనూ మనిషి పోరాడుతూనే వుంటాడు. పోరాడుతూనే వుండాలి. నిర్దిష్ట చారిత్రక భౌతిక పరిస్థితుల్లో జీవిస్తూనే అంతకంటే ముందుకాలోచించం, ఉద్యమించం మానవ లక్షణం. ఈ లక్షణం ఎంతసజీవంగా వుంటే అతని మనుగడ అంత పదిలంగా, అతని భవిష్యత్తు అంత నమ్మకంగా వుంటుంది. అలాగాక వున్న పరిస్థితులకు సర్దుకుపోతూ, వొక్కోమెట్టూ ముందుకాలోచించక ముడుచుకుపోతే, యధాతధస్థితిలో ఇరుక్కుపోతే మనిషి జీవలక్షణం పోగొట్టుకొన్నట్టు లెక్క. సమాజ పరిణామ క్రమానికి కష్టకాలం దాపురించినట్టే. విచిత్రమేమంటే ఈ స్తబ్దతనే కొంతమంది ఆరాధిస్తారు, ప్రోత్సహిస్తారు.
గత శతాబ్దంలో ఎప్పుడూ లేనంతగా ఒక స్తబ్దయుగం, తిరోగామి దృక్పధం (మనకు సంప్రదాయపు సంకెళ్ళు బిగించే కాలం) ముందుకొస్తోంది. ఆకాశాన్నంటే ఆశలకూ, పాతాళాన్ని స్పృశించే పరిస్థితులకూ జరుగుతున్న ఘర్షణ, తీవ్రమైన అభద్రతా భావం దీనిక్కారణాలు కావచ్చు.
అందువల్లనే ఈ రోజు మూఢ నమ్మకాలపై యుద్ధం ఇంకా అవసరమని ప్రజాసైన్సు ఉద్యమం భావిస్తోంది. సైన్సుకూ మూఢ నమ్మకాలకూ మధ్య ఘర్షణని నిరంతర ఆహ్వానిస్తోంది. సమాజ పరిణామ క్రమంలో చైతన్యం కల్గించటం విస్మరింపరానిదిగా భావిస్తున్నది. అందుకే, 'నిత్యజీవితంలో మూఢ నమ్మకాలు' పుస్తకాన్ని మరింత సమాచారంతో మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
- జన విజ్ఞాన వేదిక
