-
-
నిశాచరుడు - 1
Nisacharudu 1
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 254Language: Telugu
“ఓరోరి శంభుడూ... చెప్పుకోవలసిన వాడివిరా నువ్వు. ఒంటరిగా ఇక్కడికి రావటమే కాకుండా ఆ దరిద్రపుగొట్టు భూతాలన్నిటినీ బండరాళ్ళతో భయపెట్టి తరిమేశావా?” గుట్ట మొదట్లో నిలబడి ఉన్న శంభుడిని కౌగిలించుకుంటూ మెచ్చుకున్నాడు గ్రామపెద్ద.
క్రిందికి వస్తే భూమిలోపలికి వెళ్ళిపోయిన ఆకారాలన్నీ మరోసారి తమ మీదికి వచ్చేస్తాయన్న భయంతో కాబోలు, పైనే ఉండిపోయిన సైనికులకు, గ్రామస్థుల్ని చూడగానే ధైర్యం వచ్చింది.
“వాళ్ళందరూ బండల్ని దొర్లించి సాయంచేశారు. ఆ దరిద్రపు మొఖాలు అందుకే పారిపోయాయి” ఆ సైనికుల్లో నాయకుడి వంటి మనిషిని గ్రామపెద్దకు పరిచయం చేస్తూ చెప్పాడు శంభుడు.
“మీ సురభిళ రాజ్యంలో నుంచి మా సరిహద్దుల్లో ఉన్న గ్రామాల మీదికి ఏవో పిశాచాలు వచ్చి అందరినీ ఆరగించిపోతున్నాయి. వాటి అంతు చూడమని మా పరిపాలకుల వారి ఆజ్ఞ. మేము వచ్చింది అందుకే. మీ మీద దాడి చేయడానికి కాదు” తమ రాకను గురించి అడగకముందే అందుకు కారణాన్ని చెప్పాడు ఆ సైనికుల నాయకుడు.
“ఓరోరి... ఈ మాట ముందుగానే మాకు తెలిస్తే మీ వాహనాలు చెల్లాచెదురయ్యేవి కాదు” అని చెప్పబోయి, ఆఖరి క్షణంలో ఆ మాటల్ని మింగేశాడు గ్రామపెద్ద.
“తెల్లారగానే మా వాళ్ళు మీ వాహనాల్ని వెతికి పెడతారు. అప్పటివరకూ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. రండి” అంటూ తమ గ్రామంలోకి ఆహ్వానించాడు.
గుట్టను వదిలి వెళ్ళటానికి భయం ఇంకా వదలలేదు కాబోలు, మర్యాద పూర్వకంగానే తల అడ్డం తిప్పాడు ఆ నాయకుడు.
“ఈ కుర్రవాడిని మాకు తోడుగా మాతోనే ఉంచండి” అని మాత్రం అడిగాడు.
తను ఎటు కదిలితే, తాము కూడా అటువైపే కదులుతున్న పొట్టేళ్ళ తలలు నిమురుతూ చిరునవ్వు నవ్వాడు శంభుడు.
“పారిపోయినవి తిరిగిరావు. అంతవరకూ నేను మీకు స్పష్టంగా చెప్పగలను. గ్రామంలోకి వచ్చేయండి” అంటూ ముందుకు అడుగువేశాడు.
అతను ఆ మాటచెప్పిన తర్వాత అతిగా ఆలోచించలేదు ఎవరూ. తమ ఆయుధాలను పట్టుకుని గ్రామస్తులతో పాటు గ్రామంలోకి వచ్చారు.
Please enable rent option
Please enable rent option
Waiting for Part 2
Sir part2 plz
rent option plz