-
-
నిన్నటికి వీడ్కోలు
Ninnatiki Veedkolu
Author: P. S. Narayana
Publisher: Media House Publications
Pages: 192Language: Telugu
పి.ఎస్.నారాయణగారితో నా పరిచయం ముప్ఫయ్ అయిదు సంవత్సరాలుగా కొనసాగుతోంది. అప్పటినుండి తరచు కలుస్తూనే వున్నాం, మేం రాసే రచనల్లో ఏదైనా సమస్య వస్తే చర్చించుకుంటూనే వున్నాం.
ఆయన ఇంతవరకూ 250కి పైగా కథలు, ముప్ఫయ్ నవలలూ రాశారు. వాటిల్లో వేల పాత్రలు సృష్టించారు. అవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, వేదనను కలిగిస్తాయి, కంట నీరు పెట్టిస్తాయి, మనల్ని ఆలోచనలలో ముంచి తేలుస్తాయి. ఆయనదొక విభిన్నమైన శైలి. పాఠకుడిని తన వెంట లాక్కు వెళ్ళే శక్తి దానికున్నది. అందుకే వివిధ పత్రికలలో చాలా కథలు, నవలలు బహుమతులను పొందగలిగినయి. కొన్నయితే కన్నడ, తమిళ భాషలలోకి అనువదింపబడినయి.
సరళమైన పదాలతో సాధారణ పాఠకులకి కూడా అర్థమయ్యే వాక్య నిర్మాణంతో, మధ్యతరగతి మనుష్యుల సమస్యలని, ఊహలని, జీవితాలని అక్షరబద్ధం చేసిన వీరి రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మారే సామాజిక జీవన విధానాలను ఆకళింపు చేసుకొని ఎప్పటికప్పుడు నూతన తరం సమస్యల మీద వీరి రచనలు సాగడం ముదావహం. సెంటిమెంట్, మధ్యతరగతి మనుష్యుల సమస్యల నేపథ్యంలో ఉత్కంఠతతో, ఆసక్తిగా, ఊహించలేని ముగింపుతో కథల్ని వ్రాయటం వీరి ట్రేడ్మార్కు. వీరి పాత్రలు ఎన్నడూ నేలవిడిచి సాము చేయవు. మన చుట్టూ మనకు తారసపడే వ్యక్తులే ఈ కథల్లో కనిపిస్తారు. సామాన్య దృష్టికి అందని వాళ్ళ వికారాలను, సద్గుణాలనూ వెలికి తీసి కథల్లో ఆవిష్కరించగల అక్షరశిల్పి.
వీరి రచనలకు పెట్టే శీర్షికలూ అర్థవంతంగా- గాలికన్ను, రెక్కలగూడు, మంచుదుప్పటి, నిన్నటికి వీడ్కోలు, చిలిపి కిరణం, చీకటిపువ్వు... ఇలా ప్రత్యేక రీతిలో ఉంటాయి.
వీరు రాసిన కథలన్నీ శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారి కథానిలయంలో, భవిష్యత్ తరాలకు కూడా లభ్యమయ్యేలా చేసిన వీరి కృషి అభినందనీయం.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
