పరమానందం అందర్నీ ప్రేమిస్తుంది. మనమేం చేసినా పరమానందాన్ని అన్వేషిస్తాం. ప్రతి పనిలో మంచయినా, చెడ్డయినా, నీతయినా, అవినీతయినా, భౌతికమైనా, ఆధ్యాత్మికమైనా దేనికోసమో అన్వేషణ. అనంత ప్రేమకై అన్వేషణ, అదే పరమానందం.
ఏ క్షణం నువ్వు సంపూర్ణంగా, నిశ్చలంగా వుంటావో నువ్వు నీ అస్తిత్వంలో వుంటావు. అది ప్రతి మనిషి జన్మించిన క్షణం. అంతవరకు ప్రతిమనిషీ భౌతికంగా పుట్టినట్లు, ఆధ్యాత్మికంగా కాదు. అప్పుడే అతను ఆత్మగా మారతాడు. శాశ్వతంగా మారతాడు. దైవంగా పరివర్తన చెందుతాడు.
*****
కొంత మంది బాధగా వుండడానికి కారణాలు వెతకడంలో ప్రవీణులు. వాళ్ళు బాధల్లో వుంటే తప్ప సంతోషంగా వుండలేరు. వాళ్ళకు తెలిసిన ఆనందమొకటే. అదే దుఃఖం, అట్లాంటి వాళ్ళు వాళ్ళ బాధని పదింతలుగా ప్రదర్శిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఆనందంగా ఎట్లా వుంటారు?
ప్రతి సందర్భానికీ రెండు ప్రత్యామ్నాయాలుంటాయి. నువ్వు బాధని ఎన్నుకోవచ్చు. ఆనందాన్నీ ఎంపిక చేసుకోవచ్చు. ఆ దృష్టితో చూడు. ప్రతి సందర్భాన్నీ నువ్వు బాధగా మారుస్తావో, ఆనందంగా మారుస్తావో నీ యిష్టం.
