-
-
నేను వడ్డించిన రుచులు - చెప్పిన కథలు
Nenu Vaddinchina Ruchulu Cheppina Kathalu
Author: Sandhya Yellapragada
Publisher: Vanguri Foundation of America
Pages: 132Language: Telugu
మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు, కనపడిన అందరి నోట్లోనూ గుక్కెడు పంచదార పోసో, మరొక తీపి పదార్థం పెట్టో ఆ ఆనందం పంచుకోవడం ఒక సాంప్రదాయం. ఏ మాటకామాటే చెప్పుకోవాలి అంటే, మా చిన్నప్పుడు అలాంటి మంచి సందర్భాలలో మైసూరుపాక్ లాంటివి చెయ్యడమే కానీ ఇప్పటిలా బాహాటంగా అవతలివాళ్ళ నోట్లో కుక్కేసి సెల్ఫీలు తీసేసుకునే తతంగం లేదు. ఇప్పుడు దేనికైనా ‘కేకు’ రెడీ... అంతా గ్లోబలైజేషన్ ట!
ఇదంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే... ఇదిగో ఈ సంధ్య అనే అట్లాంటా అమ్మాయి ఆ మధ్య నాకు ‘నేను పడ్డించిన రుచులు’ పుస్తకం ప్రతి ఈమెయిల్లో పంపించగానే ఆత్రంగా చదవడం మొదలు పెట్టాను. అందులో మొదటి అంశమే నాకు ఎంతో ఇష్టమైన వంకాయకూర. పైగా మెంతికారం పెట్టి మరీనూ. పైగా ఆ కూర అంత అద్భుతంగా చెయ్యడానికి స్ఫూర్తిగా దాని చుట్టూ అల్లిన వంకాయోపాఖ్యానం కథా, కమామీషూ... చెప్పొద్దూ, నన్ను అడిగితే... మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా వంకాయ మెంతికారం పెట్టి చేసిన కూర కనపడిన అందరి నోట్లోనూ కుక్కేయాలి! కేకూ వద్దు, మాకూ వద్దు.
మాకు సుమారు 1500 మైళ్ళ దూరంలో ఉన్న సంధ్యని నేను అట్లాంటా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సభలో కలుసుకుంటూనే ఉన్నాను కానీ, ఆమె చేతి వంట తినే భాగ్యం ఇంత వరకూ కలగలేదు. అయినా ఇప్పుడు ఈ పుస్తకంలో కొన్ని కొన్ని వంటకాలని నేనే స్వయంగా చేసిన అనుభవంతో ఈ అమెరికా అమ్మాయి ఎంత బాగా వంట చెయ్యగలదో చెప్పగలను. ఇదివరలో నేను చేసిన వంటకాలు కంటకాలుగా ఉండేవి అని మా 'క్వీన్ విక్టోరియా'గా పేరుపొందిన మా అర్ధాంగి అనేది. ఇప్పుడు నేను ‘రహస్యంగా’ ఈ పుస్తకంలో సంధ్య చెప్పిన రెసిపీలు చేస్తుంటే నాకు ఆవిడ దగ్గర నుంచి సర్టిఫికేట్లు, అవార్డులు వస్తున్నాయి. నా సలహా పాటించి మీరు కూడా ఆ పనిలో ఉండండి. ఈ సలహా కేవలం మగంగులకే కాదు. ఆడువారికి కూడా!
- వంగూరి చిట్టెన్ రాజు
గమనిక: " నేను వడ్డించిన రుచులు - చెప్పిన కథలు " ఈబుక్ సైజు 6.3mb