-
-
నక్సలైట్ ఉద్యమం వెలుగునీడలు
Naxalite Udyamam Veluguneedalu
Author: K. Balagopal
Publisher: Perspectives
Pages: 314Language: Telugu
సమాజాన్ని మార్చే బాధ్యత తనమీద వేసుకున్న విప్లవోద్యమం సంయమనాన్ని పాటించాలని, సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని తమ ఆచరణను విలువల పునాదుల మీద నిలపాలని బాలగోపాల్ బలంగా నమ్మాడు. వారు ఏ పొరపాటు చేసినా సమాజ ప్రగతి దెబ్బతింటుందన్న ఆందోళన, ఒక కన్సర్న్ ఆయన అన్ని రచనల్లో చూడవచ్చు. ఈ వ్యాసాలలో ఆయన విప్లవోద్యమం మీద ఎన్నో విమర్శలు పెట్టి ఉండవచ్చు కాని ఇవి విప్లవోద్యమ వ్యతిరేక వ్యాసాలు కావు. విమర్శ వేరు వ్యతిరేకత వేరు. అందుకే ఆయన ‘చీకటి కోణాలు’ వ్యాసం చివర్లో రాసిన మాటలు చాలా విలువైనవి. యాభయ్యేళ్ళ నక్సల్బరీ ఉద్యమ సందర్భంలో కూడా గుర్తు చేసుకోదగ్గవి.
‘ముప్పై సంవత్సరాల నక్సల్బరీ అనుభవాన్ని సమీక్షించుకోవడమంటే విప్లవోద్యమాన్ని అమూర్తంగా ఊహించుకొని చర్చించుకోవడం కాదు. ఎం.ఎల్ పార్టీలు ఎంచుకొన్న పంథా, దానిని అమలు చేస్తున్న పద్ధతి వాస్తవంలో ఎట్లాగున్నాయో తెలుసుకోవడం అవసరం. అది సమాజంలో లేవదీసిన కొత్త ఆలోచనలనూ, విలువలనే కాదు, దాని చీకటి కోణాలనూ వాటి సామాజిక పర్యవసానాలనూ కూడా అర్థం చేసుకోవడం అవసరం. నా వ్యాఖ్యలతో అందరూ అంగీకరించకపోవచ్చు. కాని విషయాలను ఉన్నదున్నట్టుగా చూడడం అవసరం. ఇది కేవలం ఆ పార్టీ అవసరం కాదు, వారి అనుయాయుల అవసరం కాదు, ప్రజల అవసరం కూడా. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నక్షలిజం ఈ రోజు ప్రజాజీవితం పైన బలమైన ప్రభావం ఉన్న రాజకీయ శక్తి కాబట్టి.’
- జి. హరగోపాల్
