-
-
నారాయణీయం
Narayaneeyam
Author: Vinay Jalla
Publisher: Vinay Jalla
Pages: 244Language: Telugu
వినయ్ జల్లా వ్రాసిన "Warp and Weft" అనే నవలకి కొల్లూరి సోమ శంకర్ అనువాదం ఈ "నారాయణీయం". నారా అనబడే నారాయణ విజయగాథ ఈ నవల.
నవలా నాయకుడు నారాయణ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. కొన్నాళ్ళు మేనత్త సంరక్షణలో పెరుగుతాడు. మేనత్త జబ్బు చేసి చనిపోవడంతో నిరాశ్రయుడవుతాడు. తినడానికి ఏదైనా సంపాదించుకోడానికి, జరీవరం వీధుల్లో దేశదిమ్మరిలా తిరుగుతాడు. తనని జలగలా పట్టుకున్న పేదరికం నుంచి తప్పించుకోలేకపోతాడు. జరీవరంలో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు జనాలు పిట్టల్లా రాలిపోడం కళ్ళారా చూస్తాడు. మృత్యువు అతనికి ఓ వాస్తవాన్ని తెలియజేస్తుంది; జీవితాన్ని కొత్త దృక్పథంతో చూస్తాడు నారాయణ. అంత తీవ్రమైన కాటకం కూడా సిల్కు వీధి జనాలను ఏమీ చేయలేకపోడం అతన్ని విస్మయపరుస్తుంది. ఈ క్లిష్ట సమయంలో కూడా డబ్బు కల్పించే విలాసాలను, భోగాలను వారు స్వార్ధపూరితంగా అనుభవిస్తూనే ఉన్నారు. ధనవంతుల అదృష్టాన్ని విధి ఎలా మార్చేస్తుందో స్వయంగా చూస్తాడు నారాయణ. బాగా డబ్బు సంపాదించి, గ్రామంలోకెల్లా ధనవంతుడు కావాలని నిశ్చయించుకుంటాడు. అవమానాలు, హేళనలు ఎదుర్కుంటూ కూడా తన లక్ష్యం గురించే ఆలోచిస్తూంటాడు. తన కల నెరవేర్చుకోడం కోసం – జ్యోతిష్కులు, మేధావులు, మూర్ఖులు – ఎవరేం చెప్పినా ఓపికగా వింటాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకుంటాడు. మరి నారాయణకి లక్ష్మీ కటాక్షం లభించిందా? తెలుసుకోడానికి చదవండి, సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ముందుమాటతో వెలువడిన నవల “నారాయణీయం”.
* * *
యండమూరి ఆప్తవాక్యం:
ఎవరైనా ఒక రచయిత తన పుస్తకానికి ముందుమాట వ్రాయమంటే, కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్రాయటానికి కాదు. ఆ పుస్తకం మొత్తం చదవాలి కదా. అందుకు (కొందరైతే చదవకుండానే వ్రాస్తారు. అది మంచి పద్దతి కాదు).
రచయిత లబ్ద ప్రతిష్టుడైతే పర్వాలేదు. కొత్తవాడైతే మరీ కష్టం. అందులోనూ అది అనువాదం అయితే చదవటం మరింత రిస్కుతో కూడిన వ్యవహారం.
ఇన్ని అనుమానాలతో ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టాను. మొదటి పేజీ చదవగానే సందేహాలన్నీ పటాపంచలైపోయినయ్. మొదటి వాక్యమే ఆకట్టుకుంది. ఇక అక్కడినుంచీ ఆగలేదు.
ఆంగ్ల రచయిత తాలుకు ఇది మొదటి రచనో కాదో నాకు తెలీదు. సబ్జెక్టు మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్ప ఈ రచన సాధ్యం కాదు. కేవలం కథాంశమే కాదు. పాత్ర పోషణ, నాటకీయత, క్లైమాక్స్ అన్నీ బాగా కుదిరాయి.
అనువాదకుడి గురించి చెప్పకుండా ముగిస్తే అది అతడికి అన్యాయం చెయ్యటమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే: చెప్తే తప్ప ఇది అనువాదం అని తెలీదు. అంత బాగా వ్రాసాడు.
ఇద్దరికీ అభినందనలు.
- యండమూరి వీరేంద్రనాథ్
Many thanks to all readers for buying my book - hope you enjoyed reading. Please post your comments.