-
-
నరసింహ శతకము
Narasimha Satakamu
Author: Seshappa Kavi
Publisher: Victory Publishers
Pages: 130Language: Telugu
సీ॥ తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
లక్షాధికారైన లవణ మన్న మెకాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి,
తే॥ తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? భూషణ....
తాత్పర్యము: నరసింహ! తల్లి కడుపునుండి ధనమెవ్వడును తీసుకొనిరాడు, చనిపోవునాడు ఆ ధనము వెంటరాదు. లక్షాధికారైనను ఉప్పు మెతుకులే కాని, మేలిమి బంగారమును మ్రింగలేడు. డబ్బు సంపాదించి దాచిన ఇతరుల పాలు కావలసినదేగాని, ధనము వెంటరాదు. తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను బాటసారులకిచ్చినట్లుగా బాగుగ రహస్యమైన చోట భూమిలో ధనమును దాచిపెట్టి దానధర్మములు చేయక, దాచినవారు తుదకు దొంగలకో, రాజులకో ఒసంగుదురు. అనగా దానధర్మములు చేయక సొమ్ము దాచకూడదు అని భావము.
