-
-
నాకున్నది ఒక చక్కని బొమ్మ
Nakunnandi Oka Chakkani Bomma
Author: Vasundhara
Publisher: Kavya Publishing House
Pages: 56Language: Telugu
పిల్లలు - దేవుడు
దేవుడు మనిషిని తన అంశతో పుట్టించాడు. అందుకే చిన్నపిల్లల్లో దైవత్వముంటుంది. ఎదిగినకొద్దీ మనిషి ఆ దైవత్వాన్ని కోల్పోయి స్వార్థపరుడౌతాడు. స్వార్థం తనకి సుఖాన్నీ, సంతోషాన్నీ ఇస్తుందనే భ్రమలో ఉంటాడు మనిషి. నిజానికి స్వార్థం మనిషికి కష్టాలు తెచ్చిపెడుతుంది. తన కష్టాలన్నీ స్వార్థంవల్ల కలిగాయని తెలియక, దేవుణ్ణి శరణు వేడుతూంటాడు మనిషి. అలా ఒకరా, ఇద్దరా, ఎందరో!
అంతమందికి ఉపశమనం కలిగించడం తనవల్లకాదని దేవుడు మనుషుల్లో మహిళలకు అమ్మతనాన్ని ఇచ్చాడంటారు. నిస్సందేహంగా అమ్మ ప్రేమమూర్తి. కానీ అమ్మప్రేమ తనవాళ్లకే పరిమితం. అందుకే అమ్మప్రేమ అమితంగా ఆహ్లాదాన్ని ఇచ్చినప్పటికీ, అందులో దైవత్వంకంటే మానవత్వమే ఎక్కువ. ఇప్పటికీ, ఎప్పటికీ పూర్తిగా దైవత్వం నిండిన ప్రేమ చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వారి ప్రేమభావన ఎదిగిన మనుషులకు హెచ్చరిక.
చిన్నపిల్లల మాటలు, చేతలు - మన నిష్కల్మష, నిస్వార్థ ప్రేమభావనకు పునశ్చరణలు. ఆ ప్రేమభావన విషయంలో వారిని మనం గురువులుగా స్వీకరించినప్పుడే - మన ఎదుగుదల అసలు సిసలు ఎదుగుదల ఔతుంది. అదెలాగో తెలుసుకునేందుకు మచ్చుగా వినిపించిన కథే - ఈ నవలలో అమ్మలు కథ. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు - మాకే కాదు ప్రతి ఒక్కరికీ సుపరిచితాలు. అలా ఇది ఇంటింటి కథ అని మేమనుకుంటాం.
ఆంధ్రజ్యోతి సంస్థనుంచి వచ్చిన బాలల మాసపత్రిక బాలజ్యోతి ఇలాంటి రచనల్ని చాలా ఎక్కువగా ప్రోత్సహించేది. స్వర్గీయ నండూరి రామమోహనరావు నేతృత్వంలో, మాన్యులు శ్రీ శశికాంత్ శాతకర్ణి నిర్వహణలో విలువలున్న ఉత్తమస్థాయి పత్రికగా రూపొందిన ఆ పత్రిక 1983లో ఓ నవలల పోటీ నిర్వహించింది. ఈ రచనకు ప్రేరణ ఆ పోటీయే. ఆ పోటీలో ఈ నవలకు ప్రథమ బహుమతి లభించడం (ప్రచురణ: ఏప్రిల్ - నవంబర్ 1983) ఇలాంటి మరెన్నో రచనలు చెయ్యడనికి మాకెంతో ప్రోత్సహాన్నిచ్చింది. ఆ పత్రికకు, ముఖ్యంగా శ్రీ శాతకర్ణికి, ఈ నవలలో పాత్రల్నీ సన్నివేశాల్నీ సజీవం చేసిన చిత్రకారుడు శ్రీకర్కి, ముప్పయ్యేళ్ల వయసున్న ఈ పిల్లల నవలకు పుస్తకరూపాన్ని సూచించిన రచన శాయికి, ఆ వెంటనే ప్రచురణకు పూనుకొన్న కావ్య పబ్లిషింగ్ హౌస్ - పరుచూరి సుబ్బయ్యకి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
~ వసుంధర
