-
-
నాకు పదిరోజులు చాలు
Naku Padirojulu Chalu
Author: P. S. Narayana
Pages: 126Language: Telugu
స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన 10-09-1999 నుండి 05-11-1999 వరకు ధారావాహికంగా ప్రచురితమైన నవల "నాకు పదిరోజులు చాలు".
* * *
అతడు చెప్పింది నిజమే అనిపించగా చాలాసేపు మౌనంగా వుండిపోయింది ఆలోచిస్తున్నట్లుగా నీలవేణి.
"నిజమే! పొరబాటే అది... ఏం చేస్తాం.. తప్పులు చేయటం వాటిని కప్పిపుచ్చుకోవటానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవటం.... ప్చ్.. కానీయండి... ఆమెలో ఇంకా ఆ అనుమానం పోక మరేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే... అసలు మనుషుల్నే లేపేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నాకు!"
ఆమె మాటలకు జగదీశ్ ముఖంలో నెత్తురంతా గడ్డకట్టుకుపోయింది.
"ఇప్పుడెక్కడికి వెళ్ళాలి?" అడిగాదు జగదీశ్ ఆమెతోబాటు బయటకు వస్తూ.
అది ఆమె మాట ప్రకారం అతడు వేయగూడని ప్రశ్న. అయినా అతడు ఉత్సుకతను ఆపుకోలేకపోయాడు. ఇది శారద ఫోను విషయంలో ఘర్షణ పడిన అరగంటకు జరిగింది. ఆమె తన శారదకు, కిరణ్కు ఎలాంటి హాని అయినా కలిగిస్తుందేమోనని కలత చెందుతున్నాడు.
"మీ ఆవిడకి ఫోను చేయటానికి!" అంది నీలవేణి.
"ఇంటినుంచి చేయవచ్చు గదా!" అన్నాడతను.
"నా ఫోను మీద చేయటం నాకిష్టం లేదు... ఎవరైనా ట్యాప్ చేస్తే నా గుట్టంతా బయటపడుతుంది.... పబ్లిక్ ఫోన్ దగ్గరకు వెళ్దాం!"
