-
-
నాకొక శ్రీమతి కావాలి
Nakoka Srimathi Kavali
Author: Dr. Mantena Suryanarayana Raju
Publisher: Dr. Mantena Suryanarayana Raju
Pages: 139Language: Telugu
నిజానికి అనంతరాం శక్తిసామర్థ్యాలు ఏపాటివో పరీక్షించాలని కోరికగా వుంది. అందుకని ముందు కాస్తంత దగ్గాడు.
‘‘అనంతరాంగారూ! నాకు పిల్లలు పుట్టే అవకాశం వుందా! వుంటే ఎన్నో ఏడు పుట్టొచ్చు?’’ అంటూ అడిగాడు.
అతగాడు మాత్రం తక్కువ తిన్నాడా! వెంటనే ‘‘బాగుందయ్యా నీ అతితెలివి. నన్నే బురిడీ కొట్టించాలనా! త్రికాలజ్ఞుణ్ణి. అసలు నీకు పెళ్ళే కానప్పుడు...పిల్లలప్పుడే ఎలా పుడతారు? ఒకవేళ పుట్టినా ఆ సంతానానికి అక్రమ సంతానం అని చెప్పాల్సి వుంటుంది. నే చెప్పే రెండుముక్కలూ బాగా మనసుకి పట్టించుకుని విను. నువ్వేమో ఎప్పుడూ ఈస్ట్మన్ కలర్ కలలు కంటుంటావు. నీ గ్రహచారం అందుకు విరుద్ధంగా వుంటుంది’’ అంటూ ఆగాడు.
లంబోదరమూర్తి ‘‘అర్థం కాలేదు’’ అన్నాడు.
‘‘అయితే విడమర్చి చెబుతాను విను. నువ్వు ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్లాంటి ఆమెను పెళ్ళాడాలని అనుకుంటావు. కనీసం కల్పనారాయ్లాంటి బొద్దుగుమ్మడికాయ కూడా నిన్ను పెళ్ళాడటానికి ముందుకు రావట్లేదు. యామ్ ఐ కరెక్ట్?’’ అని అడిగాడు.
మూర్తి తలవంచుకున్నాడు.
వచ్చిన పనిని సానుకూలం చేసుకోవాలని 116 రూపాయలు అతనికి దక్షిణగా సమర్పించుకున్నాడు. అనంతరాం ఆ సొమ్మును లాల్చీజేబులోకి జారవిడుస్తూ అన్నాడు.
‘‘నేనో మంత్రం వ్రాసిస్తా! అది రోజూ రెండుమూడు గంటలు జపించు. అలా ఓ నలభై అయిదురోజులు చేస్తే ఫలితం కనిపించవచ్చు. అదీగాక కుజ గ్రహానికి శాంతి చేయించు. వీలుంటే పుష్య రాగం ఉంగరం’’ అన్నాక మిన్నకుండిపోయాడు.
‘‘నాపెండ్లి కరెక్టుగా ఎప్పుడౌతుందో చెప్పలేరా?’’ కూర్చున్నచోటునుండి లేస్తూ మూర్తి ప్రశ్నించాడు.
‘‘నాయనా! నేను గణితం వేసో నా ఉపాసన ద్వారానో భవిష్యత్తు చెబుతుంటాను. అంతే గాని సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుణ్ణి మాత్రం కాదు. నీ రాత తారుమారు చేయగల చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణీ కాను. మరి నాకు భోజన సమయమయ్యింది’’
లోనికి వెళ్ళిపోయాడు అనంతరాం.
లంబోదరమూర్తి తనలో తాను ‘ఏడ్చినట్టుంది వీడి జ్యోతిషపాండిత్యం!’ అనుకుంటూ ఇంటిముఖం పట్టాడు.
