-
-
ముక్తేశ్వరి పునరాగమనం
Mukteswari Punaragamanam
Author: Suryadevara Rammohana Rao
Pages: 502Language: Telugu
''ఈ మూర్ఖత్వం వల్లే రాత్రి అమ్మాయిగారి కోపానికి గురయ్యావు. అయినా నీకు బుద్ధిరాలేదు. కొందరి బుద్ధులంతే... పుట్టుకతో వచ్చినవి పోయేదాకా పోవు. ఒరే, ఒక మాటరా. నీ గుడిసెకు చుట్టూ వున్న గుడిసెలు అన్నీ రాత్రి వానకి నేలమట్టమయ్యాయి. కానీ నీ గుడిసె మాత్రం ఎందుకు కూలి పోలేదురా... నిజంగా చెప్పాలంటే అన్ని గుడిసెలకంటే నీ గుడిసె పాతది. బలం లేనిది. అయినా ఒక్క పెచ్చయినా వూడిందా? గుడిసె కూలుంటే నీ పరిస్థితి, నీ పెళ్ళాం పరిస్థితి, నీ ముసలితల్లి పరిస్థితి ఎలా వుండేదో ఆలోచించావా? అసలు ముందు చుట్టూవున్న గుడిసెలు కూలినా నీ గుడిసె ఎందుకు కూలలేదో ఆలోచించు'' గంభీరంగా అన్నాడు అయ్యన్న.
పెద్ద ఉప్పెన తాకినట్టు అదిరిపోయాడు అప్పన్న.
''ఔనురా... నేను అలా ఆలోచించలేదు. ఇంతకీ అన్నీ కూలి మధ్యలో వున్న నా గుడిసెందుకు కూలలేదురా'' అని అడిగాడు... అతని గొంతులో గొప్ప ఆశ్చర్యం వుంది. అప్పన్నతల్లి, భార్య వదనాల్లో కూడ అదే భావాలు
కనబడుతున్నాయి. అప్పన్న చెప్పాడు.
''దీనికీ ఆ అమ్మాయిగారికీ ఏదో సంబంధం వుందనిపిస్తోంది... ఇప్పుడు నువ్వు చెప్పాక...''
''ఆ అమ్మాయిగారికి గొప్పశక్తులున్నాయి. ఆమెచేత నువ్వు దెబ్బతిన్నావు కాబట్టి ఆ శక్తులే నీకు సాయంచేసి వుంటాయి. నీకు నిన్నరాత్రి జరిగిన చిత్రాలు చెప్తాను. దాన్నిబట్టి అర్థంచేసుకో".
