-
-
ముగిసిన అధ్యాయం మార్క్సిజం
Mugisina Adhyayam Marxism
Author: Uppala Narasimham
Publisher: Gnanam Publications
Pages: 128Language: Telugu
కాలప్రవాహంలో అనేకానేక ఆలోచన ధారలు అంకురించి అస్తమించాయి. ఎన్నో వ్యవస్థలు ఉద్భవించి అంతర్థానమయ్యాయి. తాజాగా మార్క్సిజం అదే మాదిరి మహాప్రస్థానం చేసింది. ఇందులో వ్యధ చెందడానికి, వగచడానికి ఏమీ లేదు. పాత నీరు పోయి కొత్త నీరొచ్చింది. సరికొత్త ఆశలు, ఆకాంక్షలను మోసుకొచ్చింది. మానవమేధ పరిమళభరితమైన సరికొత్త మొగ్గ తొడిగింది. దానికి స్వాగతం... సుస్వాగతం!
రెండు వర్గాల మాటకు మాన్యత లేదు. మార్కెట్ రహిత వ్యవస్థ అర్థరహితం, సొంత ఆస్తి రద్దు అశాస్త్రీయం, ఏకరూప సమాజం అసమంజస భావన. ఆదిమ కమ్యూనిజాన్ని పునరావృతం చేస్తామనడం ఓ అజ్ఞానం. చదివేస్తే ఉన్నమతి పోయిన చందంలాంటిది.
జ్ఞానం... విజ్ఞానం మధ్యాహ్న మార్తాండుడిలా వెలుగొందుతోంది. ఆ ఉజ్వలమైన వెలుతురులో విశ్వాసంతో మానవాళి ముందడుగు వేస్తోంది. ఎదిగిన ఈ మానవ మేధను ఎవరు అవహేళన చేసినా వారు చరిత్రహీనులు కావడం తథ్యం. అలాంటి వారు కాల రథచక్రాల కింద పడి కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం.
కారల్ మార్క్ కాలంనాటి బలమైన రాచరిక, భూస్వామ్య పరిస్థితులు నేడు లేవు. ఆనాటి మానవ చైతన్యానికి, వర్తమాన చైతన్యానికి హస్తిమశ కాంతరముంది. ఈ పరిణామ క్రమాన్ని, వ్యత్యాసాన్ని పరిశీలిస్తే మార్క్సిజం అస్తమయం ఆశ్చర్యం కలిగించదు. అంత బరువుగా తోచదు. హృదయం భారమవదు. కాలగమనంలో పూర్తిగా వెనుకబడిన మార్క్సిజానికి వీడ్కోలు పలుకుదాం. కొత్త ఆలోచనా ధారకు హారతులు పడదాం. ఒక రుతువు పోయి కొత్త రుతువు వచ్చినంత సంతోషంగా, సహజంగానే ఈ మార్పును స్వాగతించాలి తప్ప ఖిన్నులవాల్సిన అవసరం లేదు.
గత ఐదారువేల సంవత్సరాల కాలంలో ఎన్నో, ఎన్నెన్నో భావధారలు భారతదేశంలో వెలుగుచూసి వెన్నెలలా వెలిగి ఆరిపోయాయి. ఆ జాడలు చరిత్రలో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అదే మాదిరి మార్క్సిజం అస్తమయాన్ని అవలోకించాలి. అంతకు మించిన విశేషం, విశేషణం లేదు.
రెండు వందల సంవత్సరాల క్రితం మానవ శ్రమకు తొలిసారి ఆవిరి యంత్రశక్తి జతకూడటంతో వేల సంవత్సరాల మానవ జీవితం ఓ విప్లవాత్మక మార్పునకు గురైంది. మానవ చైతన్యంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పురుడు పోసుకున్న మార్క్సిజం తనదైన పాత్రను నిర్వహించి క్రమంగా పక్కకు తప్పుకుంది. మార్క్స్ అనంతరం అనేక అవిష్కరణలు మానవుడి ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ఆవిరి యంత్ర ఆవిష్కరణ దగ్గరే మార్క్, అతని అనుయాయులు కనిపిస్తారు. ఆ అనంతరం శరవేగంగా దూసుకొచ్చిన పారిశ్రామిక విప్లవాలను ఆయన అభిమానులు పసిగట్టలేకపోతున్నారు. కేవలం 'శ్రమ' చుట్టూ మానవ జీవితం పరిభ్రమిస్తుందన్న భావన తలకిందులైంది. మానవ మేధ, కృత్రిమ మేధ చుట్టూ ప్రజల జీవితం తిరగడం ప్రారంభమయ్యాక 'శ్రమ' చుట్టూ తిరిగే మార్క్సిజం ప్రాసంగికతను కోల్పోయింది. దీన్ని ఆ సిద్ధాంత అభిమానులు అంగీకరించక పోవచ్చు. అమోదించక పోవచ్చు. కాని సత్యం అసత్యం అవదు కదా? పదార్థం యథార్థం కాకుండా, యథార్థం పదార్థం గాకుండా పోదు కదా? అందుకే మార్క్సిజం అస్తమయాన్ని హుందాగా అంగీకరిద్దాం. 'అది ముగిసిన అధ్యాయం'గా గుర్తిద్దాం. కొత్త భావనల వెలుగు జిలుగులకు, సాంకేతిక పరిజ్ఞానానికి, కృత్రిమ మేధస్సుకు స్వాగతం పలుకుదాం. భేషజాలు అక్కర్లేదు, పారదర్శకత ప్రధాన వనరు. ఈ సత్యాన్ని గౌరవిద్దాం.- వుప్పల నరసింహం
