-
-
మూఢనమ్మకాలు - నాస్తిక దృష్టి
Mudha Nammakalu Nastika Drushti
Author: Gora
Publisher: Vasavya Book House
Pages: 112Language: Telugu
మూఢనమ్మకాల గురించి తెలుసుకునే ముందు నమ్మకాలు రెండు రకాలనీ, ఒకటి నమ్మకం, రెండవది మూఢనమ్మకం అని అర్ధం చేసుకోవడం అవసరం.
నమ్మడం అనేది అవసరమే. పరస్పర నమ్మకమే లేకపోతే సమాజ సభ్యులుగా జీవితం కొనసాగించడం దుర్భరమౌతుంది. నిత్యం మనం తెలుసుకొనే ఎన్నో విషయాలు నిర్ధారణ చేసుకోకుండానే నమ్మి వేస్తూ వుంటాం. అయితే ఒక అనుమానం వచ్చినప్పుడు మన నమ్మకం వాస్తవమా, కాదా అని తేల్చుకోవలసి ఉంది. అట్లు తేల్చుకోకుండా “నాకు సత్యాసత్య నిర్ధారణతో పనిలేదు, నేను నమ్మినదే నాకు సత్యం" అని అంటే మౌఢ్యం ప్రవేశించినట్లవుతుంది. మనస్సులోని తలుపులను మూసివేసినట్లవుతుంది. అప్పుడది మూఢనమ్మకం అవుతుంది.
మనకు నమ్మకాలతో తగాదా లేదు. ఎందుకంటే అనుమానం వచ్చినప్పుడు నమ్మకాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. కాని మూఢనమ్మకం అలా కాదు. అటు నిర్ధారణ చేయనివ్వరు; ఇటు అది అసత్యమని చెప్పనివ్వరు. ఇది ఒక విచిత్రమైనస్థితి. ఈ స్థితిని కొంత అజ్ఞానం పోషిస్తోంది. మరికొంత అవినీతి పోషిస్తున్నది. అజ్ఞానమూ, అవినీతి ఏకమైనప్పుడు అవినీతి నిర్ధారణ చెయ్యనివ్వదు; అజ్ఞానం నిర్ధారణకు పూనుకోదు. కనుక రెండు సందర్భాలలోను నమ్మకాన్ని ప్రత్యక్ష నిర్ధారణ అనే గీటురాయి మీద పెట్టిచూద్దామంటే ప్రక్క దాటువేస్తారు.
సమాజంలో రకరకాల మౌఢ్యాలు వ్యాపించి ఉన్నాయి. మౌఢ్యానికి మూలం ఆశ్చర్యమూ, భయమూ, సాధారణంగా జరిగే విషయాలలో అవి మనకు అలవాటయినవి గనుక ఆశ్చర్యము ఉండదు. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి తెలుసుకొని ఉంటాము. గనుక భయం ఉండదు. అసాధారణత ఎడల ఆశ్చర్యం, వాటిగురించి సరియయిన జ్ఞానం లేకపోవడంచేత భయం, ఆశ్చర్యం వల్ల కుతూహలం వస్తుంది; భయంవల్ల ప్రశ్నించకుండా గుడ్డిగా అంగీకరించడం అలవడుతుంది. కుతూహలం వల్ల ప్రచారం చేస్తారు. భయంవల్ల గుడ్డిగా అనుసరిస్తారు. ప్రశ్నవెయ్యలేని కుతూహలం, నిర్ధారణ చెయ్యలేని భయం, వీటితో ఆధారస్థితికి ప్రజలు బానిసలయి పోతున్నారు. మూఢనమ్మకం మానవుని జిజ్ఞాస యొక్క దివాళాకోరుతనాన్ని, ధైర్యం యొక్క ఓటమిని సూచిస్తుంది. కనుక మూఢనమ్మకాలననుసరించేవారు ఆలోచనలను తాకట్టు పెట్టారు. నిర్భయత్వాన్ని చంపివేశారు.
మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నామంటే మానవుణ్ణి తిరిగి ఆలోచింపమని కోరుతున్నాము. నిర్భయంగా సత్య నిర్ధారణ చెయ్యమని కోరుతున్నాము.
- లవణం
