-
-
మట్టి మనిషి - వుప్పల నరసింహం కథలు
Matti Manishi Uppala Narasimham Kathalu
Author: Uppala Narasimham
Publisher: Gnanam Publications
Pages: 391Language: Telugu
తెలంగాణలో 1970వ సంవత్సరంలో పురుషునికి రెండు రూపాయలు, ఆడవారికి రూపాయి మాత్రమే కూలీరేట్లు వుండేవి. మాదిగ, మాల, చాకలి, గొల్లలు మొదలగు కులాల వాళ్ళు వెట్టి పనులు చేసేవాళ్ళు. తక్కువ కూలీ, నామమాత్రపు జీతాలు, వెట్టి చాకిరితో ప్రజలు అణగారి పోయారు. నిర్బంధ చాకిరికి తోడుగా ఎప్పుడూ తిట్లు, తన్నులతో వారిని బానిసలుగా చూసేవారు. పోలీస్పటేల్, పట్వారీలు ప్రజలను పీడించుకు తినేవాళ్ళు. గ్రామంలో ఎవరికైనా మంచి ఎడ్లు కానీ, ఆవులు కానీ వున్నట్లు తెలిస్తే వాటిని ఉచితంగానో, నామమాత్రపు ధరలతో స్వంతం చేసుకునేవారు. వారి కన్నుపడితే భూములైనా, పశువులైనా వారి స్వంతం కావాల్సిందే. రైతులు కూడా జీవితం గడవక, శుభకార్యాల కోసం అప్పులు చేసి, ఉన్న కొద్దిపాటి భూమిని కుదవబెట్టి, అదే క్రమంలో పశువుల్ని కూడా పోగొట్టుకుని - క్రమంగా కౌలుదార్లుగా, పాలేర్లుగా, కూలీలుగా మారేవారు. కుటుంబ తగాదాలైనా, వీధి తగవులైనా దొరలు జోక్యం చేసుకుని దండుగలు వేసి వారి ఆస్తులను, పశువులను స్వాధీనం చేసుకునేవారు. ఎదిరించిన వాళ్ళకు దండన, పోలీసు భయం ఎలాగూ వుండేవి.
తెలంగాణలో నెలకొన్న ఈ దారుణమైన పరిస్థితిని, ప్రజల అమాయకత్వాన్ని - అజ్ఞానాన్ని, దొరల దోపిడి - వెట్టిచాకిరికి గురవుతున్న ప్రజల కష్టాలను వుప్పల నరసింహం తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు.
- కె.పి. అశోక్ కుమార్
వుప్పల నరసింహం కథల ఏకైక నెరేటివ్ అజెండా - భూస్వాముల దౌష్ట్యం, భూస్వామ్య వ్యవస్థ క్రూర సంఘటనల కింద నలిగిన సామాన్య ప్రజల బతుకులు, తెలంగాణకు చెందిన చాలామంది కథా రచయితలు అవలంభించిన ధోరణే ఇది. అయితే గ్రామీణ జీవితాన్ని, అక్కడి వృత్తుల విశేషాలను, జనం నాలుకలమీది నుడికారాలను ఇంత చక్కగా పట్టుకున్న రచయిత వేరొకరు నాకు కనిపించలేదు. కావలివాండ్లు, సాపలల్లెవాండ్లు, సొన్నాయిలోళ్లు, వెట్టిచాకిరికి అంటుకుపోయిన పాలేర్లు, మేదరవాండ్లు, శారదకాండ్లు, ఎరుకలోళ్లు, గౌండ్లోళ్లు... వగైరా... వివిధ అణగారిన కులాల, వృత్తుల వెతలను ప్రతిబింబిస్తాయి ఈయన కథలు.
- ఆడెపు లక్ష్మీపతి
