-
-
మార్క్స్ ‘కాపిటల్’ పరిచయం-2
Marx Capital Parichayam 2
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 549Language: Telugu
'కాపిటల్'లో కొన్ని విషయాలు చాలా వివరాలతో వున్నాయి. కొన్ని విషయాలు తక్కువ వివరాలతో వున్నాయి. ఏ రచనలో నైనా, 'వివరించడం'లో, ఈ రకమైన ఎక్కువ తక్కువలు వుంటూనే వుంటాయి. ఒక రచనలో ఎక్కువగా వివరించిన వాటి ఆధారంతో, ఎక్కువగా వివరించని వాటిని కూడా అర్థం చేసుకోవాలి. 'చెప్పిన' వాటి ఆధారంతో, 'చెప్పని' వాటిని కూడా అర్థం చేసుకోవాలి!
'మార్క్స్ - కాపిటల్'ని చదవడం ప్రారంభించినప్పుడు, దాదాపు 20 ఏళ్ళ కిందట, అది ఎంత గందరగోళంగా అనిపించేదంటే, ఆ బాధ చెప్పడానికి వీలు లేదు. ఎక్కువ సార్లు విసిగెత్తి పోతూ వుండేది. మళ్ళీ ఎలాగో మూలుక్కుంటూ మళ్ళీ చదవడం ప్రారంభించడం! ఎక్కడ దాకా చదివామో కూడా తెలిసేది కాదు. చదివిందీ, చదవందీ అంతా ఒక్కలాగే ఉండేది. కానీ ఎక్కడైనా ఒక్క వాక్యం అర్థమైతే, అంత బాధా పటాపంచలయ్యేది. అర్థమైన వాక్యం అంత అద్భుతంగా ఉండేది. "ఇంక ఎప్పుడూ విసుగు తెచ్చుకోకూడదు. ఓపిగ్గా చదువుకోవాలి. అంతే మరీ. ఆయనకి బోలెడు సమస్యలూ, ఆర్ధిక బాధలూ, అనారోగ్యమూ! ఇంతకన్నా ఏం తేలిగ్గా రాస్తాడు?" అలా చెప్పుకుని పాత విసుగంతా వదిలించుకోవడం! కానీ ఒక్క పేజీ నడిచేడప్పటికీ మళ్ళీ... మహా గందరగోళం!
సముద్రానికో గుణం వుంటుంది. ఒడ్డున నించున్న వాళ్ళ మీద పడి ఒక కెరటం లోపలికి లాగేస్తుంది. నీళ్ళల్లో పడి కళ్ళు తేలేసి ఇక మునగడానికి సిద్ధంగా వున్నప్పుడు ఇంకో కెరటం బైటకి తోసేస్తుంది. 'బతికాం రా దేవుడా' అని ప్రాణాలు అరిచేత పట్టుకుని లేవబోతుంటే, మూడో కెరటం మళ్ళీ తనతో తీసుకుపోతుంది. అలాగే, 'కాపిటల్'తో పేజీ పేజీకి, జీవన్మరణ సమస్య అయి పోతూ వుంటుంది.
భాష తెలియని గానం ఇది! పెద్ద గడ్డంతో, తంబూరా వాయిస్తూ, ఒక బాటసారి ఏదో మృదువుగా శ్రావ్యంగా పాడుతున్నట్టుగా వుంటుంది. కరుణతో, కోపంతో, శౌర్యంతో, దుఖ్ఖంతో, బాధతో, ప్రేమతో - పాడుతున్నాడని తెలుస్తూ వుంటుంది. కానీ భాష తెలీదు. ఎవరి మీదో ఆగ్రహ పడుతున్నాడని తెలుస్తుంది. ఎవరి మీదో ప్రేమ కురిపిస్తున్నాడని తెలుస్తుంది. ఎందుకో ఏమిటో తెలీదు. కానీ, ఆయనేం చేయగలడు? ఆయన భాష అదీ! దాన్నే మనం నేర్చుకోవాలి! వినీ వినీ నేర్చు కోవాలి! మనకి భాష రాకపోతే ఆయనేం చెయ్య గలడు? ఆ తప్పు మనదీ.
నిజం గానే, ఆ మొదటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు 'కాపిటల్'ని అర్థం చేసుకోడం చాలా తేలిక. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చదువుతోంటే, చెప్పలేనంత ఆశ్చర్యంగా వుంటుంది. "ఇంత తేలిగ్గా వుందే! దీన్నేనా అప్పుడు అంత విసుక్కున్నదీ!" అని నమ్మలేనంత ఆశ్చర్యంగా వుంటుంది!
