-
-
మంచిమాట-మంచిబాట
Manchi Mata Manchi Bata
Author: C. Umadevi
Publisher: J.V.Publications
Pages: 256Language: Telugu
నాడు పెద్దల మాట చద్దిమూట అంటే నేడు పాతచింతకాయ పచ్చడి కూడా అంటే మరెలా? పెద్దలు మౌనాన్ని ఆశ్రయిస్తే మంచిమాట చెప్పేవారెవరు? మంచిబాట వేసేవారెవరు?
నడక నేర్పిననాడే నడత కూడా నేర్పాలనే సూత్రం పాటిస్తే మనిషి మహోన్నతుడవుతాడు. తల్లిదండ్రులు తమ పెంపకంలో మెళకువలు పాటించి చిన్నరులను తీర్చదిద్దగలిగితే బాల్యంలోనే బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది. యవ్వనమొక అద్దం లాంటింది. అస్పష్ట చిత్రాలెన్నో అక్కడ ఫ్రేము కట్టుకోవాలనుకుంటాయి. స్పష్టమైన అవగాహన పెంచుకోకపోతే బ్రతుకు చిత్రం చెదిరిపోతుంది.
దాంపత్యానికి పునాది పెళ్ళి. అయితే ఎక్కడో అక్కడ బీటలువారుతున్న దాంపత్యసౌధం గుండెను కలుక్కుమనిపించక మానదు. మన మనసుకు మనం మరిచిపోయిన పాఠాలను గుర్తు చేస్తునే ఉంచాలి. వ్యక్తిత్వం వికసించాలంటే మనసు పరిమళించాలి. భార్యాభర్తల బాట ఒకటైతేనే గమ్యం సుగమం.
మరలిపోయిన వసంతం రాదనుకుని దిగులు పడితే వృద్ధాప్యం మరింత భారమనిపిస్తుంది. వణుకుతున్న చేతికి ఆలంబన కావాలి. నాడు తమ చేతిని పట్టుకు నడిపిన ఆ చేతికి ఈనాడు చేయందిస్తే ఆ ప్రకంపనలు చేతికే కాదు మనసుకు తగుల్తాయి. బంధాలను పట్టి ఉంచేది మానవతా స్పర్శే కదా!
మనసును కుదిపే ఆలోచనలు ఎన్ని తోడిపోసినా మళ్ళీ మొలకలేస్తునే ఉంటాయి. ఒక మంచిమాట ఎవరిని ప్రభావితం చేసినా పండేది బ్రతుకు బాటే కదా! బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం... జీవనయానంలోని వివిధ దశలలో మనల్ని పలకరించే విభిన్న అంశాలపై సమాలోచనే ఈ వ్యాస సంకలనం, 'మంచిమాట-మంచిబాట'. అడుగెయ్యండి మరి!
- సి. ఉమాదేవి
