-
-
మళ్ళీ సాక్షి నామ సంవత్సరం
Malli Sakshi Nama Samvatsaram
Author: Dr. Kampalle Ravichandran
Publisher: Kantamneni Venkateswararao
Pages: 120Language: Telugu
“సాక్షి” సినిమాను గురించి ఒక చిరుపొత్తం రచించడం కన్నా బాపు, రమణలకు ఇంకా గొప్పనివాళి ఏముంటుంది? కవివాక్కు ఋషివాక్కులాంటిది. ఏ ముహుర్తంలో ఆరుద్ర ఈ చిత్రంలో,
‘అమ్మకడుపు సల్లగా అత్తకడుపు సల్లగా
బతకరా బతకరా పచ్చగా....’
అని రాశారో గానీ, ఆంధ్రదేశంలోని ఏ తల్లి కడుపు చలువ వలనో, ఏ అత్త దీవెన వలనో, బాపు రమణలు “సాక్షి”తో సినీ జైత్రయాత్ర ప్రారంభించి, సెల్యులాయిడ్‌పై తెలుగుదనాన్ని కడవలకొద్దీ కుమ్మరించి, తెలుగు సినిమాను పచ్చగా పదికాలాలపాటు బతకనిచ్చారు. ఎప్పుడు బాపు సినిమా వచ్చినా, ఇళ్లల్లో భార్యలు తమ భర్తలతో “ఏవండీ! బాపు గారి సినిమా వచ్చిందంటండి. ఇవాళ మొదటాటకే వెలదామండీ!” అని ఒప్పించి మరీ థియేటర్ల వైపు అడుగులేసేటంతగా మనతో కలిసిపోయారీ ఇద్దరు మిత్రులు.
ఈ పుస్తకం పరమాన్నంలోని ఓ మెతుకును పట్టి చూపడమే కాదు, తెలుగు నేలపై నడయాడిన ఇద్దరుచంద్రులకు ఓ నూలుపోగు కూడా. “సాక్షి” చిత్రమంతా వెన్నెలే! ఎటుచూసినా, ఎప్పుడు చూసినా, ఎంత చూసినా, ఎలా చూసినా వెన్నెల్లే! అంత స్వచ్ఛంగా ఉంటుందీ చిత్రం.
చివరగా ఒక మాట. కాలప్రవాహంలో ఎన్నెన్నో పుష్కరాలు వస్తుంటాయి. పోతూ ఉంటాయి. పవిత్ర గోదావరీ నదీమతల్లి మాత్రం అలాగే ఉంటుంది, తన కవల పిల్లల వంటి బాపు, రమణలను కనులారా చూసుకుంటూ. ఆ మహద్భాగ్యం చాలు, మానవజన్మలకు!
- కంపల్లె రవిచంద్రన్
