-
-
మహీధర గేయ కథలు
Mahidhara Geya Kathalu
Author: Dr. Mahidhara Nalini Mohan
Publisher: Kavya Publishing House
Pages: 66Language: Telugu
అప్పుడూ అప్పుడూ పిల్లల కోసం తెలుగు పత్రికలలో నేను వ్రాస్తూ వచ్చిన గేయకథలలో కొన్నింటిని తీసి, ఈ సంపుటంలో చేర్చాను. ఈసఫ్ కథలనుంచి కొన్నీ, టాల్స్టాయ్, సుత్యేయేవ్, చిలకమర్తిల కథల నుంచి కొన్ని, పంచతంత్రం నుంచి కొన్ని, నేను విన్నవి కొన్ని, స్వయంగా కల్పించినవి కొన్ని ఇందులో ఇతివృత్తాలు.
''హరేరామ హరేకృష్ణ'' అంటూ భజనలు చేస్తూ, రుద్రాక్షమాలలు, కాషాయ వస్త్రాలూ ధరించి, హిందూమత సారం అంతా ఒంటబట్టించుకుంటున్నామనీ, యోగీశ్వరులం అయిపోతున్నామనీ అనుకునే విదేశస్థులు కొందరు ఇటీవల బయలుదేరేరు. భజన చేయడం, భంగు తాగడం వంటి పనులు సులభమేకానీ, అతిముఖ్యమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించం సుఖసుఖాల జరిగే పని కాదు. అసలు అది అవసరమని కూడ వారికి తెలియదు. ఈ విషయం ''కోతి తపస్సు'' అనే కథలో కనిపిస్తుంది.
కొన్ని దేశాలు సాధించిన వైజ్ఞానికాభివృద్ధిని చూచి ''రీసెర్చి చెయ్యండి. లేకపోతే చంపేస్తామని బెదిరించి ఉంటుంది ఆ ప్రభుత్వం. ఆ భయంతో సైంటిస్టులు పని చేసేస్తూ ఉండి ఉంటారు'' అని తృప్తి పడే జనం కొందరున్నారు. తుపాకీ బారుచేసి, మనిషి చేత గొడ్డులాగ పని చేయించడం సాధ్యమైతే కావచ్చునేమో కాని, కవిత్వం అల్లించం, సంగీత రచన చేయించడం, శాస్త్ర పరిశోధన చేయించడం వంటివి మాత్రం సాధ్యం కాదు. ఈ పనులకీ ''నిరుపహతి స్థలాదులు'' (భయానికి తావులేని ప్రశాంత వాతావరణం) అవసరం. ఈ విషయం ''జబర్ధస్తీ'' అనే కథలో కనిపిస్తుంది.
కొందరు ఛాందసులున్నారు. వారు అనుక్షణమూ ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని వైజ్ఞానికుల్నీ ఆక్షేపిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ వైజ్ఞానికులు కనిపెట్టిన ఆధునిక ఉపకరణాల సౌలభ్యం మాత్రం వాళ్లకు కావాలి. ఈ విచిత్ర మనస్తత్వం ''బొగడచెట్టు కింద పంది'' అనే కథలో కనిపిస్తుంది.
అన్నీ వదులుకుని సన్యాసిలా జీవిస్తున్న వాడికి కూడ ఏదో ఒక అల్ప విషయం మమకారహేతువు అవుతుంది. దానికోసం నానా హైరానా పడతాడు. ఆ మమకారపు పొర తొలిగిపోయిన మరుక్షణంలో అతడు నిజమైన సన్యాసి అవుతాడు. ఈ సంగతి ''వైరాగ్యం'' అనే కథలో కనిపిస్తుంది.
ఆత్మహత్యకు ప్రయత్నించం వట్టి పిరికితనం. ఏదో రకం ఇబ్బందులు ప్రతీ వారికీ ఉంటూనే ఉంటాయి. వాటికి విరుగుడు ఆలోచించాలే కాని చచ్చిపోవడం కాదు చేయవలసిన పని. సృష్టిలో ఒక్క మానవుడు తప్ప మరే జీవి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యదు. మనం కల్పించుకున్న కట్టుబాట్లులోనే ఎక్కడో ఈ లోపం ఉంది. ఈ విషయాన్ని ''ప్రాణం మీద తీపి'' అనే కథలో చూస్తాం.
ఈ విధంగా ప్రతీ కథలోనూ ఏదో ఒక నీతి గాని, చమత్కారం గాని అంతర్లీనమై ఉంటుంది. ఇందులో ఉపయోగించినవన్నీ మాత్రా ఛందస్సులు. పాదానికి 12 గాని, 14 గాని, 16 గాని, 18 గాని, 20 గాని, 22 గాని మాత్రలు కలవి. ఈ ఛందస్సులకు ఇంతవరకూ పేర్లు ఏమీ లేవు. వీటికి లయ ముఖ్యం. యతులు, ప్రాసలు, అంత్యానుప్రాసలు వగైరా అందచందాలు కావాలంటే చేర్చుకోవచ్చు.
- మహీధర నళినీమోహన్
