-
-
మహాకవి జాషువ జీవితం - సాహిత్యం
Mahakavi Jashuva Jeevitam Sahityam
Author: Dr. Chengalva Ramalakshmi
Publisher: Victory Publishers
Pages: 119Language: Telugu
వినుకొండలో పుట్టి విశ్వనరుడిగా ఎదిగిన కవి జాషువ! తెలుగు సాహిత్యంలో జాషువది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం!
సమాజంలో సాటి మనుషుల సమస్యలకు స్పందించి చేసే రచనలు చైతన్య ప్రేరేపకాలుగా ఉంటాయి. గొప్పగా ఉంటాయి. అవి ఆ కవుల విశాల దృక్పథాన్ని చాటుతాయి. వాటిని విశ్లేషించే కోణం భిన్నంగా ఉంటుంది.
సమస్యలను స్వయంగా అనుభవించిన వారి జీవితంలో నుంచి వచ్చిన కవిత్వానికి ఉండే బలం, శక్తి ఇంకా భిన్నంగా ఉంటుంది.
జాషువ జీవితం బాల్యం నుంచి వేదనామయం! సమాజం నుంచి ఆయన మనసుకు తగిలిన గాయాలు సామాన్యమైనవి కావు. అయితే అప్పటికప్పుడు బాధపడుతూ, ఎప్పటికప్పుడు అధిగమిస్తూ కులవివక్ష లేని సమసమాజం కోసం తపిస్తూ కవిత్వం రాశారాయన. జాషువ కవిత్వం ఆవేశపూరితం కాదు. సున్నితమైన సరళమైన పదాలతో ఉన్న భావవ్యక్తీకరణ వారిది! ఆలోచింపజేసే కవిత్వం వారిది!
జాషువ కలలు కన్న అభ్యుదయ సమాజం ఇంకా కొంత దూరంలోనే ఉంది!
జాషువ ఏ సమాజం నుంచి అవమానాలను, తిరస్కారాలను అందుకున్నారో అదే సమాజం నుంచి అంతకు రెట్టింపు గౌరవ సత్కారాలందుకున్నారు. అది వారి గొప్పతనానికి ప్రజలు పట్టిన నీరాజనం!
తనకు జరిగిన అవమానాలకు జాషువ క్రుంగిపోలేదు. అటువంటి వివక్ష నుంచి సమాజాన్ని విముక్తి చేయటానికి కవిత్వ మాధ్యమం ద్వారా ప్రయత్నించారు. జాషువ జీవితం - సాహిత్యం ఒక అత్యుత్తమ వ్యక్తిత్వ వికాస గ్రంథం లాంటిది.
ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కుని, ఒత్తిడిని అనుకూలంగా మలచుకుని, మనోబలంతో, స్వయం కృషితో సాధించలేనిదేదీ లేదని చాటిన జాషువ జీవితం, దానిని ప్రతిబింబించిన వారి కవిత్వం నేటి పాఠక లోకానికి స్ఫూర్తి దాయకం!
జాషువ కవిత్వంపై పలువురు లోతైన పరిశోధన చేశారు. అనేక గ్రంథాలు జాషువ సాహిత్యంపై వచ్చాయి. విడిగా వ్యాస సంకలనాలు అనేకం వచ్చాయి. ఇంకా వస్తాయి కూడ! చదువుతున్న కొద్దీ ఆలోచింపచేస్తుంది జాషువ కవిత్వం!
జాషువ జీవితం - సాహిత్యం అనే ఈ చిన్న పుస్తకం జాషువ జీవిత విశేషాలను, రచనలను పరిచయం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటానికి దోహదం చేస్తుంది.
- డా. చెంగల్వ రామలక్ష్మి
