-
-
'మద్య'తరగతి 'మందు'హాసం
Madya Taragati Mandu Haasam
Author: Yadhati Kasipathy
Publisher: Yadhati Family
Pages: 116Language: Telugu
శ్రీశ్రీని మహాకవిగా తెలుగు ప్రజలు భుజాల మీద పెట్టుకు మోశారు. అదే ప్రజలు అదే శ్రీశ్రీ తాగుడు వ్యసనాన్ని తెగనాడారు. తన గురించి ఎవరు ఏమనుకున్నా శ్రీశ్రీ తాను మాత్రం నిరంతరం ప్రజాపక్షమని రుజువు చేశారు. నేను రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడినే అయినా కమ్యూనిస్టు జీవితాన్ని ఒంటబట్టించుకోలేకపోయానని శ్రీశ్రీ ఎన్నో సందర్భాల్లో తానే బహిరంగంగా చెప్పుకున్నారు. తన జీవితంలోని ఆటుపోట్ల గురించి, క్లిష్టమైన సమయాల గురించి, పడ్డ అవమానాలు, సాధించిన ఓటముల గురించి ఆయనకాయనే బయటికి చెప్పుకున్నారు. కానీ, మన చరిత్రకారులు ఎంత చిత్రమైన వాళ్ళో మనందరికీ తెలిసిందే కదా! శ్రీశ్రీ గురించి రాసినవారిలో ఎక్కువమంది ... శ్రీశ్రీ కవిత్వం, ఆయనతో తమ అనుభవాలు, ఆయనతో కలిసి తాగిన సందర్భాలను మాత్రమేరాసుకొచ్చారు కానీ, యాధాటి కాశీపతి మాత్రం ఇందుకు విరుద్ధంగా, వాస్తవాల్ని వాస్తవాలుగా ఈ పుస్తకం రూపంలోకి తీసుకువచ్చారు.
కాశీపతి సీనియర్ జర్నలిస్టు, తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ సారథుల్లో ఒకరు. చరిత్ర గతిని నిర్వచించిన చాలా ఉద్యమాల్లో ఆయన పాత్ర వుంది. అంతేకాదు, ఆయన శ్రీశ్రీకి గ్లాస్‌మేట్. శ్రీశ్రీ మీద ఒక నానుడి వుంది. తాగకపోతే బాగా రాస్తాడు, తాగితే ఇంకా బాగా రాస్తాడు అని. శ్రీశ్రీతో కలిసి కూర్చుని మందుహాసం చేసిన చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన అనేక విషయాలకు కాశీపతి రాసుకున్న నోట్సే ఈ మద్యతరగతి మందుహాసం పుస్తకం.
వరవరరావు గారు ముందుమాటలో రాసినట్టుగా శ్రీశ్రీకి కాశీపతి మరో మల్లినాథసూరి. శ్రీశ్రీ తన జీవితంలోని చాలా పార్శ్శాలను బాహాటంగానే బయటికి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం తమ కుటుంబాన్ని ఎలా బజారున పడేసిందో వివరంగా చెప్పారు. ఇష్టం లేకపోయినా సినిమాలకు ఎందుకు రాయాల్సివచ్చింది, నిజమైన కమ్యూనిస్టుగా ఎందుకు మారలేకపోయారు, తాగుడుకు అలవాటు పడడానికి కారణాలేమిటో శ్రీశ్రీ చెప్పారు. మహాప్రస్థానం వంటి మరో మహోన్నత రచనను ఎందుకు చేయలేకపోయానో కూడా చెప్పారు. ఇంకా ఈ పుస్తకంలో చాలా విశేషాంశాలున్నాయి. రావిశాస్త్రి గారు శ్రీశ్రీకి చెప్పిన జె&జె సెక్షన్ కథను శ్రీశ్రీ చెప్పగా ఈ పుస్తకంలో చదవొచ్చు.
మహాకవి అని పిలిపించుకున్న శ్రీశ్రీ మరొకరిని మహాకవి అన్నారా? వాల్మీకి, షేక్స్పియర్ కంటే తాను గొప్పవాడినని శ్రీశ్రీ ఎందుకన్నారు? శేషేంద్రశర్మ ఇంట్లో రాలిన పదాలేవి? ఒక అర్థరాత్రి వేళ పావురం కోసం శ్రీశ్రీ ఎందుకు పట్టుబట్టారు - ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి. ఇంకా, శ్రీశ్రీ సృష్టించిన అనేక కొత్త పదాలు మీకీ పుస్తకంలో దొరుకుతాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శ్రీశ్రీ అంతరంగం. శ్రీశ్రీ కంటే కొన్ని తరాలు కాలం ముందుకు నడిచినా, మాసిపోని అనేక కథలు, గాయాలు ఈ పుస్తకంలో నిత్యనూతనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఫోర్స్‌ను అర్థం చేసుకున్న విధానం, నూతన ఆర్థిక వ్యవస్థ మూలాల విశ్లేషణ వంటి విషయాలు ఇవ్వాళ్టికీ ఫ్రెష్‌గా కనిపిస్తాయి.
శ్రీశ్రీ అభిమానులు, సాహిత్యాభిలాషులు కొని చదవాల్సిన విలువైన పుస్తకం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. చదవండి, కాస్తంత ఆలస్యంగానైనా శ్రీశ్రీ విలువైన అంతరంగాన్ని తెలుసుకుందాం.
