-
-
మాయిముంత
Maayimuntha
Author: Peddinti Ashok Kumar
Pages: 161Language: Telugu
'' తల్లికుంటే బిడ్డ దొర్సానట. బిడ్డెకుంటే తల్లి బాంచెదట. దాని కండ్లకు మనం కనవడుతున్నమా! ఆపతికి సంపతికి ఆదుకుంటదని బిడ్డని ఊర్లె ఇత్తే అగ్గిల బొర్రియ్యవట్టె.'' సాయన్న విరక్తిగా అన్నడు.
ఇద్దరు మౌనంగా పక్క మలిచిండ్రు. సాయన్నకు కన్నంటుకుంది. సాయమ్మకు కన్ను మలుగుతలేదు. బిడ్డదేవనే గుర్తుకత్తుంది. ఆమె తిట్టిన తిట్లే బొచ్చెల మెరుత్తున్నయి.
సాయమ్మకు ముగ్గురు బిడ్డలు. దేవనే చిన్నది. ఇద్దరు బిడ్డలను వేరే ఊరిచ్చిండ్రు. దేవను ఊల్లెనే మేనరికం ఇచ్చిండ్రు. యాడాది రెండేండ్లు గడిచినయి. దేవ ఊర్లెనే కాబట్టి తల్లిగారింటికి పొద్దునవత్తే మాపున ఎల్లిపోయేది. ఇద్దరు బిడ్డలు మాత్రం వారాలకు వారాలు ఉండేవాళ్లు.
వచ్చినప్పుడు వారాలకు వారాలుంటరు. ఉన్నదంతా అక్కలకే పెడుతుందని దేవ అనుమానం. ఊర్లేనే ఉంటుంది గదా! ఉన్నదంతా దేవకే పెడుతుందని అక్కల అనుమానం. మొగండ్లు ఎగేసిండ్రు. అత్తలు దిగేసిండ్రు. అక్క చెల్లెండ్లు ముగ్గురు శికెలువట్టుకున్నరు.
బర్రె పెయ్య దగ్గర పంచాది ముదిరింది. గొంగి బర్రెను దేవ మలుపుకుంది. మాకూ పెయ్య దుడ్డెలను కొనియ్యిమన్నరు పెద్ద బిడ్డలు. వాళ్లకు చెరొకటి కొనిచ్చింది సాయమ్మ. యాడాది రెండేండ్లలో అవి కట్టి ఈనినయి. దేవది గొంగి పెయ్య మాత్రం కట్టలేదు ఈనలేదు.
